హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ‘అల్లు అర్జున్ ఏమైనా భారత్, పాక్ బార్డర్లో యుద్ధం చేసి గెలిచి వచ్చిండా? సినిమా తీసిండు.. కోట్లు సంపాదించిండు.. వెళ్లిపోయిండు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఒక ప్రైవేట్ టీవీ చానల్‌తో మాట్లాడిన ఆయన, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉన్నదని, దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని చెప్పారు. ‘అల్లు అర్జున్ వల్ల ఒక తల్లి చనిపోయింది.. ఒక పిల్లాడు కోమాలో ఉన్నాడు. ఈ ఘటనకు కారణమైన అల్లు అర్జున్ను అరెస్టు చేస్తే తప్పేముంది? ఆ బాబు కోలుకొని తన తల్లి ఎక్కడ అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?’ అంటూ ప్రశ్నించారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్యా ఉండకపోయేదని, కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావుడి చేశారని, దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడడంతో పరిస్థితి కంట్రోల్ కాలేదని చెప్పారు.
అందుకే ఆయనపై ఏ-1 కేసు పెట్టలేదని, మిగతా వారిపై పెట్టారని, అల్లు అర్జున్‌పై ఏ-11గా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. తన ఫేవరెట్ హీరో కృష్ణ అని చెప్తూ.. ఆయన ఇప్పుడు లేరని, ఇప్పుడు తానే స్టార్‌నని, తనకే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండాలన్నారు. అల్ల్లు అర్జున్ అరెస్టయ్యాడని ఎవరైనా నిరసన తెలిపితే వాళ్లను కూడా జైల్లో వేస్తామని హెచ్చరించారు. మోహన్‌బాబు కేసు కోర్టు పరిధిలో ఉన్నదని పేర్కొన్నారు. ఫ్రీ బస్సు వల్ల మెట్రో రైలు నష్టాల్లో ఉందన్న చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించానని చెప్పారు. హామీల అమలుకు తొందరెందుకని, ఇంకా ఐదేండ్ల సమయం ఉన్నదని చెప్పుకొచ్చారు. రేవంత్ 28వ ఢిల్లీ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం హైదరాబాద్ రాన్నారు. రెండు రోజులు వేచి చూసినా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అపాయింట్మెంటు దొరక్కపోవటం గమనార్హం.