రామచంద్రాపురం, ఫిబ్రవరి 18: ‘నేను కేసీఆర్‌ను సూడాలే.. కన్ను మూయాలే’.. ఇదీ ఓ పండుటాకు చివరి కోరిక. ‘నేను ఎప్పుడు పోతనో తెల్వదు. సచ్చే ముందర ఒక్కసారి నాకు ఆసరా ఇచ్చి బతికించిన దేవుడు, మాయన్న కేసీఆర్‌ను సూడాల. అప్పుడే నేను పోవాలా’ అంటున్నది. సీఎం కేసీఆర్‌ని చూడాలని కల్వరిస్తున్నది వనపర్తి జిల్లా ఆత్మకూర్‌కు చెందిన ఎంగల్ రామలింగమ్మ. చివరి రోజులను లెక్కిస్తున్న ఈమె సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ ఎంఐజీలో తన కొడుకు విరూపాక్షి ఇంట్లో ఉంటున్నది. ఆమె పెద్ద మనుమడు పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ అమ్మమ్మ పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ‘రఘూ.. వస్తడా అయ్య కేసీఆర్’ అని అడిగితే తప్పక వస్తాడు అమ్మమ్మా అని చెప్తూ సముదాయించారు.