GDN Trailer | ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా జాతీయ స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న నటుడు ఆర్. మాధవన్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారతదేశపు గొప్ప ఆవిష్కర్త, ఇంజనీర్ మరియు ‘ఇండియాస్ ఎడిసన్’ అని పిలవబడే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (జి.డి. నాయుడు) బయోపిక్‌లో నటిస్తున్నాడు మాధవన్. ‘G.D.N’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటారును తయారు చేసిన జి.డి. నాయుడు.. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు, ఆవిష్కరణల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ట్రైలర్లో మాధవన్ యువకుడిగా మరియు వృద్ధుడిగా రెండు విభిన్న గెటప్‌లలో కనిపించి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా వృద్ధుడి పాత్రలో ఆయనను గుర్తుపట్టలేనంతగా ప్రాస్థెటిక్ మేకప్‌తో అద్భుతంగా రూపాంతరం చెందారు. “బ్రిటిషర్లు భయపడ్డారు.. సొంత దేశస్థులు మర్చిపోయారు” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ఈ చిత్రంలో మాధవన్‌తో పాటు సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్, తంబి రామయ్య వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాధవన్ స్వయంగా స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. వర్గీస్ మూలన్ పిక్చర్స్ మరియు మాధవన్ స్వంత బ్యానర్ ట్రైకలర్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ’96’ ఫేమ్ గోవింద్ వసంత అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అరవింద్ కమలనాథన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.