ఫ్రిజ్, ఓవెన్.. వంటింటి పరికరాలే! అయినా, వీటిని పక్కపక్కన ఉంచకూడదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను సరిగ్గా నిర్వహించకుంటే.. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
వంటగదిలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. గ్యాస్ లీక్, కుక్కర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్.. ఇలా ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. అందులోనూ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు అక్కడే ఉంటే.. అగ్నికి ఆజ్యం పోసినట్లే! వీటివల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు.
అలాకాకుండా ఉండాలంటే.. ఫ్రిజ్, ఓవెన్ లాంటివాటిని గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాంతంలో ఉంచాలని సూచిస్తున్నారు. ఇక ఫ్రిజ్ పక్కనే ఓవెన్‌ను పెట్టి వాడటం ఏమాత్రం మంచిదికాదు. మైక్రోవేవ్ వాడేటప్పుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడితో రిఫ్రిజిరేటర్ కంప్రెసర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రిఫ్రిజిరేటర్ అసాధారణంగా వేడెక్కి.. పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఫ్రిజ్ పక్కన గ్యాస్‌స్టవ్ ఉంచినా.. ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంటుంది.