చలికాలంలో పెరుగు తినకూడదని.. తింటే జలుబు చేస్తుందని కొంతమంది భావిస్తుంటారు. రుచికరమైన పెరుగును శీతాకాలంలో తినొచ్చా?లేదా? మరీ ముఖ్యంగా పిల్లలకు పెట్టొచ్చా అనే సందేహాలు రావడం సహజం. చలువ చేసే గుణం ఉన్న పెరుగును చలికాలంలో తింటే.. గొంతు నొప్పి, జలుబు వచ్చే అవకాశం ఎకువగా ఉంటుందనే వాదన వినిపిస్తుంటుంది. కానీ, ఈ సీజన్లో పెరుగును తినడం వల్ల అందులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తాయి.
పెరుగు తినడం వల్ల శక్తి పెరగడంతోపాటు జలుబు, దగ్గు నుంచి కూడా రక్షణ కలుగుతుంది. చలికాలంలో జీర్ణక్రియలు కాస్త మందగిస్తాయి. పెరుగు తినడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. చలికి పొడిబారిన చర్మాన్ని కాపాడటంలో పెరుగుది ప్రధాన పాత్ర. ఇందులో సమృద్ధిగా ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పెరుగును ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎముకలు, దంతాల సమస్యకు చక్కటి ఔషదంలా పెరుగు పనిచేస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ డి శరీరానికి కావాల్సిన సత్తువనిస్తాయి.
చలికాలంలో పెరుగు తినడం వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నా ఫ్రిజ్‌లోంచి తీసి వెంటనే తినొద్దు. అలా చేస్తే గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఫ్రిజ్‌లో ఉంచింది కాకుండా మామూలు పెరుగును తినడానికి ప్రాధాన్యం ఇవ్వండి. మంచి నిద్రకోసం కొంతమంది రాత్రి పూట పెరుగు తింటుంటారు అలా చేస్తే శరీరంలో కఫం పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలగవచ్చు. అందుకే, పగటి పూట తినడానికే ప్రాధాన్యం ఇవ్వండి. దగ్గు, జలుబు, సైనసైటిస్‌తో బాధపడేవారు కొన్ని రోజులు పెరుగు తినకపోవడమే మంచిది.