వెదురు, మోదుగు ఆకులతోపాటు వరిగడ్డి, మక్కజొన్న బెరడు, బెండు, చెరుకు పిప్పి, వేప చెక్క, వరి పొట్టు, మక్కజొన్న పొట్టు వంటి పదిహేడు రకాల వ్యవసాయ వ్యర్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో రోజువారీ జీవితంలో ఉపయోగించే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, దువ్వెన, వాటర్ బాటిల్, ఫ్లాస్క్, ట్రేలు, ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, బాక్స్‌లు, స్పూన్లు, గరిటెలు ఇలా వందకుపైగా ఎకో ఫ్రెండ్లీ వస్తువులను డాక్టర్ వేద్ ఉత్పత్తి చేస్తున్నది. మనకు ఆరోగ్యం, ప్రకృతికి ఆహ్లాదం ఇచ్చే మా ప్రొడక్ట్స్‌కి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్నది!
‘పెన్నులపై మన్ను కప్పితె గన్నులై మొలుస్తయ్’ అన్నమాట తరుచుగా వింటుంటాం. పెన్నులు మొలకెత్తడం నిజమే. అయితే.. అవి గన్నులు కావు.. మానులయ్యే మొక్కలు! ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. కాలుష్యం తగ్గించాలి. పర్యావరణాన్ని కాపాడాలని తేజస్విని సుధ కొలువు మాని కొత్త కెరీర్ ఎంచుకుంది. ‘డాక్టర్ వేద్’ పేరుతో ప్రతి ఇంట్లో ఉండే ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ వస్తువులు తయారు చేస్తున్నది. ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని ‘జిందగీ’తో పంచుకున్నారిలా..
నేను బీటెక్ చదివాను. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆపరేషన్స్ టీమ్ లీడర్‌గా పని చేస్తున్నాను. మా ఆయన వెంకటేశ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. కరోనా మహమ్మారి వల్ల జనం ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ప్రకృతిని కాపాడుకోవాలనే అవగాహన వచ్చింది. అందరిలా నా ఆలోచనల్లోనూ మార్పు మొదలైంది. మేము ఏదైనా సొంతపని ప్రారంభిస్తే ఈ ప్రకృతికి కొంతైనా మేలు చేసేలా ఉండాలనుకున్నాం. ఆ పని మాతోపాటు నలుగురికీ ఉపయోగపడాలని కోరుకున్నాం. చేయబోయేది కొత్తగా ఉండాలన్నదే మా ఆలోచన. అలా గ్లోబల్ వార్మింగ్‌ని తగ్గించే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల గురించి ఆసక్తి కలిగింది. పర్యావరణహిత వస్తువుల వ్యాపారం చేయాలనుకున్నాం. వాతావరణంలో వేడి పెరిగిపోతున్నది. భవిష్యత్‌లో ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చు. గ్లోబల్ వార్మింగ్‌కు ప్లాస్టిక్ వినియోగం పెరగడం కూడా కారణమే. ప్లాస్టిక్‌తో ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. భవిష్యత్‌లో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాల కోసం ప్రజలందరూ ఆలోచించాల్సిందే! రేపటి అవసరాల కోసం ఈ రోజే ప్రయత్నం మొదలుపెడితే వ్యాపారంలో మంచి భవిష్యత్ ఉంటుంది. నలుగురికి మేలు చేసినవాళ్లం అవుతామని వెదురు, గడ్డి, మరికొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులతో తయారయ్యే పర్యావరణహిత వస్తువులతో వ్యాపారం చేయాలనుకున్నాం.
వెదురు మిగతా కలప లాంటిది కాదు. దీనిని నరికితే మళ్లీ పెరుగుతుంది. కాబట్టి పర్యావరణానికి నష్టం ఉండదు. పర్యావరణహితమైన ఉత్పత్తుల తయారీ గురించి మాకు అవగాహన లేదు. వీటి గురించి తెలుసుకునేందుకు మా ఆయనతో కలిసి హైదరాబాద్‌లో కొన్ని వర్క్‌షాప్‌లలో పాల్గొన్నాను. ముంబయి, మరికొన్ని చోట్లకు వెళ్లి ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తుల గురించిన సదస్సులకూ హాజరయ్యాం. అక్కడ వివిధ రకాల వస్తువుల తయారీకి వాడే యంత్రాలు, వాటి నిర్వహణ నేర్చుకున్నాను. అలాగే ఈ రంగంలో ఉన్న కొన్ని స్టార్టప్‌లు చూశాం. వాళ్లు వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టారో అధ్యయనం చేశాం. ఫైనల్‌గా ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా జీరో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ తయారు చేయాలనుకున్నాం. కొన్నింటిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్‌తో తయారు చేయడం సాధ్యం కాదు. అలాంటి వాటిని తక్కువ ప్లాస్టిక్‌తో తయారు చేయాలని నిర్ణయించుకున్నాం.
ఉద్యోగంలో సంపాదించింది పైసా పైసా పొదుపు చేశాం. ఆ డబ్బే మా పరిశ్రమకు పెట్టుబడి. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని జీడిమెట్లలో మా ఉత్పత్తి ప్రారంభించాం. మొదట రీసైకిల్ పేపర్‌తో పెన్నులు, పెన్సిళ్ల తయారీ మొదలుపెట్టాం. వాడిన తర్వాత రీసైకిల్ చేసిన పేపర్ని కొనుగోలు చేశాం. అలాగే ఒక యంత్రాన్ని సమకూర్చుకున్నాం. ఒక వర్కర్ని పెట్టుకుని పెన్నులు, పెన్సిళ్లు తయారు చేశాం. వీటిని వాడిన తర్వాత పారేస్తే భూమిలో కలిసి పోతాయి. ఎలాగూ భూమిలో వేయాలనే చెబుతున్నాం కదా అని ఈ పెన్నులో ఓ విత్తనం పెడుతున్నాం. వాడిన తర్వాత ప్రతి పెన్ను, పెన్సిల్ మొలకెత్తుతుంది. మానై పర్యావరణానికి మేలు చేస్తుంది!
మొదట్లో.. వెదురు, కాగితం, గడ్డి, కలపతో వస్తువులు తయారు చేసి అమ్ముతాం అంటే.. ‘ఇవి ఎవరైనా కొంటారా?’ అంటు చాలామంది చులకన చేసి మాట్లాడారు. అయినా మంచి ఉద్దేశంతో కొనసాగించాం. సమాజానికి అవసరమైనదే చేస్తున్నాం. ఆదరణ ఉంటుందనుకున్నాం. మొదటి ఏడాదిలో జనానికి అర్థం కాలేదు. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా టూత్ బ్రష్‌లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు, ట్రేలు, కిచెన్ వేర్, టిఫిన్ ప్లేట్స్, బౌల్స్, గ్లాస్లు, కప్పులు ఉంటాయని చాలామందికి తెలియదు. ఎవరో ఒకరు చూసి వాడి, బాగుందని అంటే మిగతావాళ్లు ఆసక్తి చూపుతారు. అలా మా ఉత్పత్తులకూ నిదానంగా ఆదరణ పెరిగింది. కొన్నాళ్లకు లులూ మాల్లో స్టాల్ పెట్టాం. అది చూసిన జనం ‘ప్లాస్టిక్ వదిలేద్దామనుకుంటున్నాం. కానీ, వేరే ప్రత్యామ్నాయం లేక వాడక తప్పట్లేదు. ఇంతకాలం తెలిసి తప్పు చేశాం. ఇక చేయం’ అన్నారు. అలాంటి వాళ్ల ఆదరణతోనే మేం నిలబడగలిగాం. ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయని జనానికి చెప్పాలని ప్రదర్శనల్లో పాల్గొంటున్నాం. నలుగురికీ పరిచయం చేస్తున్నాం.
కిచెన్‌లో ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు. ముఖ్యంగా పసుపు, ఉప్పు, కారం వాటిల్లో నిల్వచేయకూడదు. కూరగాయలు కోసే పీట (చాపింగ్ బోర్డ్) ప్లాస్టిక్దైతే రోగాలు కొని తెచ్చుకున్నట్టే! వెదురుతో మేం తయారు చేసిన కంటెయినర్లు, చాపింగ్ బోర్డ్ కొనడానికి ఎక్కువమంది ఇష్టపడ్డారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. దానికి తగ్గట్టే కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం. రెండో ఏడాది నాటికి మేం నిలదొక్కుకున్నాం. మొదట్లో ఉద్యోగాలు చేస్తూనే వీటిని తయారు చేసేవాళ్లం. వీటికి ఆదరణ, ఆర్డర్లూ పెరిగాయి. ఆయన ముందు జాబ్ మానేశారు. ఇది చూసుకోవాలని నేనూ మానేశాను. తర్వాత కాలంలో వెదురుతో ఫర్నిచర్ తయారీలోకి వచ్చాం. మల్కాపూర్‌లో బ్యాంబూ ఫర్నిచర్ తయారీ యూనిట్ పెట్టాం. వెదురుతో కుర్చీలు, సోఫాలు, టేబుళ్లు, బుట్టలు, షెల్ప్, ల్యాంప్ హ్యాంగర్, ఇంటీరియర్ డెకరేటివ్స్ తయారు చేసి అమ్ముతున్నాం. వెదురుతో ఏది కావాలని అడిగినా వాటిని తయారు చేసి ఇస్తాం. ఉద్యోగం కంటే ఇందులోనే ఎక్కువ ఆదాయం వస్తున్నది. రెండేళ్లలో కోటిన్నర రూపాయలు టర్నోవర్ సాధించాం. మేం సక్సెస్ అయ్యామనడానికి ఇంతకంటే ఏం కావాలి?!
తయారీ రంగంలో ప్లాస్టిక్‌ని వేడి చేయడం వల్ల కార్బన్-డై-ఆక్సైడ్ విడుదలవుతుంది. మా తయారీ యూనిట్ నుంచి ఆ విషవాయువు విడుదల కాదు. మేము తయారు చేసే పాత్రలు, గృహోపకరణాలు, గృహాలంకరణ వస్తువులు యంత్రాల సాయంతో తయరు చేస్తాం. వేడిని ఉపయోగించం. జీరో కార్బన్ మా లక్ష్యం.
– తేజస్విని
– గడసంతల శ్రీనివాస్