సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 3 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు సైతం ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చింది. మహా నగర పరిధిలో ఏకంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో సామాన్యుడి ఇండ్లు కూల్చి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నది. మూసీ పేరిట నిరుపేదల ఇండ్లను నేలమట్టం చేసి వారిని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి ఆదుకుంటున్నామని గొప్పలు చెప్పుకొంటున్నది. రెండు ప్రభుత్వాల మధ్య ఎంత తేడా?! పేదరికమే అర్హతగా కేసీఆర్ ప్రభుత్వం ఆత్మగౌరవ ఇండ్లను మంజూరు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ బుల్డోజర్ కింద నిర్మాణాలు నలిగిపోవడమే ప్రాతిపదికగా అవే డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నది. అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఒక పండుగలా నిర్వహిస్తే… ఇప్పుడు అదే ఇండ్ల పంపిణీ గాయం చేసిన వాళ్లే ఆయింట్మెంట్ రుద్దినట్లుగా కనిపిస్తున్నది. కేసీఆర్ హయాంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదంటూ విమర్శించిన నోటితోనే బుల్డోజర్ బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారు.

నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలు…
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఇండ్లు అంటే అగ్గిపెట్టెల్లా ఉంటాయనేది కండ్ల ముందు కనిపించే సత్యం. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లయినా… బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన వాంబే గృహాలైనా! పేర్లు వేరేగానీ పరిమాణాలు మాత్రం ఒకటే. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను తెచ్చింది. రెండు పడక గదులతో నిరుపేదలకు ఇచ్చే ఇండ్లల్లో వారు ఆత్మగౌరవంతో బతకాలని ఆశించింది. ఆ మేరకు కేవలం హైదరాబాద్ మహా నగర పరిధిలోనే లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది.
కరోనా, ఇతరత్రా సమస్యలతో కొంత ఆలస్యమైనా… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి దాదాపు 65వేల ఇండ్ల వరకు పేదలకు పంపిణీ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. దఫదఫాలుగా జరిగిన ఈ పంపిణీ కార్యక్రమాలు అప్పట్లో నగరంలో నిరుపేదల పండుగలకు ప్రతీకలుగా నిలిచాయి. ప్రధాన నగరంతో పాటు కొల్లూరులోనూ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల విలువ బహిరంగ మార్కెట్లో కనీసంగా రూ.50-60 లక్షల విలువ ఉండటంతో ఆ నిరుపేద లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే మిగిలిన ఇండ్ల నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ చేపట్టలేదు. కానీ ఆతర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయకుండా తాత్సారం చేస్తున్నది.
కొన్నిచోట్ల చిన్న చిన్న పనులు పెండింగులో ఉన్నా వాటిని పూర్తి చేయడం లేదు. చివరకు పూర్తయిన ఇండ్ల సముదాయం వద్ద మౌలిక వసతుల కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను సైతం వెనక్కి తీసుకుంది. పైగా కేసీఆర్ హయంలో అసలు ఇండ్లే కట్టలేదు.. నిరుపేదలకు ఇవ్వలేదు.. అంటూ రెండున్నర సంవత్సరాలుగా రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయకపోవడం ఒక వంతైతే… అప్పటికే నిరుపేదలు ప్రశాంతంగా ఉన్న ఇండ్లల్లో సర్వేలు అంటూ మరోవైపు భయాందోళనలు సృష్టిస్తున్నది. అయితే ఈ జాప్యంపై శాసనసభలోనూ పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. చివరకు స్పీకర్ సైతం తాను సమావేశం నిర్వహించమని చెప్పినప్పటికీ సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టించుకోవడంలేదనే అసంతృప్తిని సైతం వ్యక్తం చేశారు.

అక్కున చేర్చుకుంటున్న డబుల్ బెడ్రూం ఇండ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాలు అవుతున్నా నగరంలో ఒక్కటంటే ఒక్కటి నిరుపేదలకు ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించినా ఇప్పటిదాకా సరైన మార్గదర్శకాలే రూపొందించలేకపోయింది. ఎంతసేపూ… కేసీఆర్ ప్రభుత్వం అసలు ఇండ్లే కట్టించలేదనే రాజకీయ విమర్శలతోనే రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ హయాంలో పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లను పేదలకు ఎందుకు ఇవ్వడంలేదనే అనుమానం, ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ సర్కార్ ఆలోచన మాత్రం మరోలా ఉందనేది చోటుచేసుకుంటున్న పరిణామాలతో అర్థమవుతున్నది.
ఒకవైపు హైడ్రా… మరోవైపు మూసీ.. ఇలా ఎడాపెడా సామాన్యుడు, పేదల ఇండ్లను కూల్చడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందనేది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో ప్రభుత్వ బుల్డోజర్ల కింద నిర్మాణాలు నలిగి అనేక మంది రోడ్డున పడుతున్నారు. గూడులేక చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మారారు. అయితే ఇలాంటి బుల్డోజర్ బాధితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా కనిపిస్తున్నది. ఇందులో భాగంగా 2024, అక్టోబర్‌లో అనాలోచితంగా మూసీ సుందరీకరణ పేరిట చాదర్‌ఘాట్, మూసానగర్, వినాయక వీధి, శంకర్‌నగర్ ప్రాంతాల్లో వందలాది ఇండ్లను కూల్చివేశారు. వాళ్లందరికీ కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు.
అదేవిధంగా అదే సంవత్సరం సెప్టెంబర్ 8న హైడ్రా సున్నం చెరువును సుందరీకరిస్తామంటూ అక్కడ ఏండ్ల తరబడిగా నివాసం ఉంటున్న నిరుపేదల గుడిసెల్ని బుల్డోజర్లతో నేలమట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. చివరకు చిన్న పిల్లలు తమ పుస్తకాలను తీసుకుంటామన్నా సమయం ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరించింది. కూల్చివేతల తర్వాత కూడా ఆ శిథిలాల మధ్య నిరుపేదలున్నా వారిని వెంటాడి హైడ్రా అధికారులు భయబ్రాంతులకు గురి చేశారు.
కరెంటు తీసి చీకట్లో మగ్గేలా వ్యవహరించారు. దీంతో హైడ్రా అమానవీయ చర్యలకు తట్టుకోలేక ఆ నిరుపేదలు వీధినపడ్డారు. చెత్త సేకరించే వృత్తిగా ఉన్న వాళ్లకు కనీసం అద్దె ఇండ్లు కూడా లభించక అల్లాడిపోయారు. చివరకు వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటూ ఇటీవల హైడ్రా ప్రకటన చేసింది. ఇంకా పంపిణీకి సిద్ధంగా వేలాది ఇండ్లు సిద్ధంగా ఉండటమంటే ఇండ్లులేని అర్హులైన నిరుపేదలకు అవి దక్కాలి. కానీ ఏ క్షణంలో ఎక్కడ సర్కార్ బుల్డోజర్ పేదలపై విరుచుకుపడుతుందో తెలియదు. కానీ ఆ చర్యల ద్వారా వీధినపడే వారికి మాత్రం కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు నీడనిచ్చి ఆదుకునేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాయనేది అర్థమవుతున్నది.