హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణ సెక్రటేరియట్లో హౌస్కీపింగ్ సిబ్బంది ఆందోళనకు దిగడం కలకలం రేపింది. గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ సిబ్బంది బుధవారం ధర్నా చేపట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సెక్రటేరియట్లో పనిచేసే సిబ్బందికే రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నామని, కుటుంబపోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు తెచ్చుకొని కాలం వెళ్లదీస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, కాంట్రాక్టర్లు వెంటనే స్పందించి తమకు బకాయి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.