దాదాపు ప్రతి ఖండాన్ని ప్రభావితం చేసే వాతావరణ ఘటన తరుముకొస్తున్నది. సముద్రాలు వేడెక్కటం వల్ల వాతావరణంలో బలీయమైన మార్పులు కలిగించే ఎల్ నినో ప్రభావంతో ప్రకోపం ఎంతో దూరంలో లేదనే హెచ్చరికలు అంతకంతకూ మిన్నంటుతున్నాయి. ఎల్ నినో ప్రారంభం కావటం 80 శాతం ఖాయమని, అది అంతిమంగా తీవ్రస్థాయికి చేరుకోవటం 90 శాతం ఖాయమని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ వాతావరణ విభాగం (డబ్ల్యూఎంవో) స్పష్టం చేసింది. భౌగోళిక ఉష్ణోగ్రతలు ఈ సరికే కాకలు పుట్టిస్తున్నాయి. ప్రపంచ వ్యవసాయం తీవ్రమైన వత్తిడికి గురవుతున్నది. ఈ నేపథ్యంలో ఎల్ నినో వేగంగా దూసుకువస్తుండటం ఆందోళన కలిగించే విషయమే. ఈసారి ఎల్ నినో ప్రభావం ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సెంట్రల్ అమెరికాతో పాటు ఈసారి వర్షపాతం సగటుకు దిగువన ఉంటుందని భావిస్తున్న దక్షిణాసియాలో ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూఎంవో హెచ్చరిస్తున్నది. అదే పరిధిలోకి వచ్చే తెలంగాణ ఎల్ నినో దుష్ప్రభావాలకు దూరంగా ఉండలేదనేది వాస్తవం. వర్షాలు తగ్గిపోయి ఎండలు పెరగటం అనేది అంతిమంగా ప్రభావం చూపేదీ సాగు మీదనే. పైగా రాబోయే ఉత్పాతానికి సంసిద్ధం కావటానికి సమయం చాలా తక్కువగా ఉన్నదని శాస్త్రవే త్తలు అంటున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నదా అనేది ఇప్పుడు మనముందున్న ప్రశ్న.
తెలంగాణ పీఠభూమిపై ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి వ్యవసాయంలో అధికశాతం వర్షాధారంగానే సాగుతుంది. వానలు ముఖం చాటేస్తే సాగు సడుగులు విరిగిపోతాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఆదుకునేది ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనే. ఆ సోయి కరువైన కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ నీటి భరోసాకు నీళ్లు వదిలింది. ప్రాజెక్టులను పడావు పెడుతూ జలాశయాలను ఎండబెడుతున్నది. ఇటీవల ఎల్ నినో భయంతో కాళేశ్వరం మరమ్మతులంటూ కొంత హడావుడి చేసినా పనులు ముందుకు సాగటం లేదు. మరోవైపు ఎల్ నినో వంటి ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గించటంలో చెట్ల పెంపకం చాలా కీలకం. కేసీఆర్ హయాంలో చేపట్టిన తెలంగాణకు హరితహారం అద్భుత ఫలితాలను సాధించింది. 2015-21 మధ్యకాలంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్ల నుంచి 21,214 చదరపు కిలోమీటర్లకు అంటే దాదాపు 8 శాతం మేర పెరిగింది. పల్లెలు, పట్టణాల్లోని అటవీయేతర ప్రదేశాల్లో వృక్షాల పెరుగుదల 14.5 శాతానికి పెరిగింది. 2019-21 అంచనాల్లో హరితావరణం విస్తరణలో దేశ సగటును మించిపోయి ప్రశంసలు అందుకున్నది తెలంగాణ. హరితహారం కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవంగా పేరు మార్చి తూతూమంత్రంగా నడుపుతుండటం మనం చూస్తున్నాం. ఈ రెండు ప్రధాన అంశాలు ఎల్ నినో సంసిద్ధతలో సర్కార్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఇప్పుడు ఎల్ నినో ఉత్పాతం తలుపు తడుతున్న వేళ రేవంత్రెడ్డి హడావిగా సమీక్ష జరిపి, అధికారులకు మొక్కుబడిగా ఆదేశాలిచ్చి చేతులు దులిపేసుకున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతులకు కష్టాలు ఇప్పట్లో తప్పేలా కనిపించటం లేదు. ఓ వైపు సాగుకు సర్కార్ పెట్టుబడి సాయం ఎగ్గొట్టటమే కాకుండా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తగిన స్థాయిలో అందుబూటులో ఉంచటం లేదు. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల విషయమై నరకం చూపిస్తున్నది. తాజాగా యూరియాపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. ఇదంతా చూస్తుంటే వానకాలం సాగుబడి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే దడ పుడుతున్నది. సర్కార్ సహాయ నిరాకరణకు వర్షాల లేమి తోడైతే రైతు పరిస్థితి అధోగతే. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుల స్థితిగతులపై దృష్టి సారించాలి. అలాగే తక్షణ ప్రాతిపదికపై సాగుబడికి అవసరమైన పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి కొనుగోళ్ల వ్యవస్థను సమూలంగా చక్కదిద్దాలి. అప్పుడే తెలంగాణ రైతన్న ఎల్ నినో దుష్ప్రభావాల నుంచి కొంచెమైనా ఉపశమనం పొందగలుగుతాడు.