హైదరాబాద్ మీ అయ్య జాగీరా? ఏమయా? ఆ ? అంటూ తెలంగాణ సమాజాన్ని బెదిరిస్తూ, భుజాలెగిరేసురేకుంటూ పవన్ కల్యాణ్ ప్రదర్శించిన హావభావాలు, ఎచ్చుల మాటలు.. గద్దరన్నకు బండికొనిచ్చిన అంటూ బండెనుక బండి కట్టిన పాటను నేనే రాసిన అంటూ బిల్డప్‌లు ఇస్తూ, హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ జర్నలిస్టులను నడిరోడ్డుమీద కూర్చోబెట్టిన అహంకార ప్రదర్శనలు.. ఆయన పగటేషాలు అన్నీ జాగ్రత్తగా గమనిస్తే.. మల్లోసారి తెలంగాణ సమాజం అస్తిత్వ సంక్షోభంల పడుతున్నదనీ అర్థమైంది. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఆంధ్రా ఆధిపత్య వ్యవస్థల ఆటవిక వ్యవస్థనే రాజ్యమేలుతున్నది. దాడి చేసే క్రూరమృగానికి కావల్సింది అవకాశమే కానీ, విచక్షణ కాదు.
అడవిలో తోడేలు దాడి చేసినప్పుడు దాని బారి నుంచి జింక ఒకసారి తప్పించుకోవచ్చు. అంతమాత్రాన ఆ క్రూరమృగం మళ్లీ ఎప్పటికీ దాడి చేయదని అనుకుంటే అంతకంటే అది జింక అమాయకత్వం తప్ప మరొకటి కాదు. పవన్ కల్యాణ్ చంద్రబాబుతో హైదరాబాద్‌లో జరిగిన మొన్నటి మోదీ రహస్య సమావేశంలో లోపాయికారి ముచ్చట్లు, అనంతరం రేవంత్‌రెడ్డితో బహిరంగ సమావేశంలో నాతో కలిసి పో మని ఆహ్వానిస్తూ చెప్పిన బహిరంగ రహస్యం తెలంగాణ బుద్ధిజీవులకు అర్థం కాకుండా ఉంటుందా? ఈ కుట్రల పరిణామాలను ప్రజలకు అర్థం చేయించే దిశగా ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం- ఏకమౌదాం తెలంగాణ సమస్తం అంటూ పిలుపునివ్వాల్సిన అత్యవసర స్థితి ఏర్పడింది.. దీనిని గుర్తిస్తూ, గన్‌పార్క్ వద్ద.. అమరులకు నివాళులు అర్పిస్తూ టీజేఎఫ్ ఆవిర్భావ రజతోత్సవ ముగింపు వేడుకలను సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టులందరం కలిసి నిర్వహించుకున్నాం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్వరాష్ట్రంలో ఆంధ్రా వలసవాదం అంతమైందని సంతోషించే లోపే, ఇప్పుడు దానికి తోడుగా కేంద్రంలోని నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయం కన్ను కూడా మన భాగ్యనగరంపై పడింది. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుని, హైదరాబాద్ సంపదను కొల్లగొట్టడానికి కేంద్ర బీజేపీ పెద్దలు సామాన్యుల ఊహలకు అందని సరికొత్త కుటిల పన్నాగాలు పన్నుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రకటనలో సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి.. తెలంగాణను ప్రపంచానికి గేట్ వేగా మార్చుతాను అన్నారు. కానీ, అంతకుముందే మోదీ, అమిత్ షా జోడీకి తద్వారా బీజేపీకి దక్షిణ భారతదేశంలోకి రాజకీయంగా చొరబడటానికి హైదరాబాద్‌ను ‘గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా’ (దక్షిణ భారత ద్వారం)గా మార్చే ఎత్తుగడలు వ్యూహాలు ఇప్పటికే అమలులోకి వచ్చినాయి.. అనేదానికి, మీ అయ్య జాగీరా? అంటూ.. పవన్ కల్యాణ్ కూసిన కూతలే నిదర్శనం.
ఒకవైపు పక్క రాష్ట్రం నుంచి చంద్రబాబునాయుడు నడుపుతున్న తెరవెనుక వ్యూహాలు, మరోవైపు ఢిల్లీ బీజేపీ పెద్దల కుటిల నీతి, వీటన్నింటినీ భుజానకెత్తుకుని ఇక్కడి వ్యవస్థలను శాసిస్తున్న రేవంత్‌రెడ్డి రూపంలో తెలంగాణపై ఇప్పుడు ముప్పేట దాడి స్పష్టంగా నడుస్తున్నది. ఈ లోపాయికారి రాజకీయ వ్యూహాలు నిన్న మొన్నటివి కావు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఈ కుట్రకు పునాదులు పడ్డాయి. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కావడం దగ్గరి నుంచి, ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చొనే వరకు జరిగిన ప్రతి పరిణామాన్నీ నిశితంగా పరిశీలిస్తే దీని వెనుక ఎవరి హస్తం ఉన్నదో తెలిసిందే. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, రేవంత్‌రెడ్డి రాజకీయ పొత్తులను అర్థం చేసుకోవాల్సి ఉన్నది. తెలంగాణ అస్తిత్వం మీద దాడిలో, మోదీ, చంద్రబాబుల ఉమ్మడి ప్రణాళిక దాగి ఉన్నదనే నిజం తెలంగాణవాదులకు ముందే అర్థమైనా పవన్ కల్యాణ్ ఓవర్ యాక్షన్‌తో, చంద్రబాబు, మోదీ, రేవంత్ నడుమ ఏర్పడిన ఈ ‘ట్రయాంగిల్’ పొలిటికల్ గేమ్, వాళ్ల అసలు రంగును బయటపెట్టింది.
హైదరాబాద్ నడిమధ్యన ప్రతిష్ఠిస్తున్న ఆంధ్ర నాయకుల విగ్రహాలు కేవలం సాధారణ విగ్రహాలు కావు. అవి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని పరీక్షించడానికి శత్రువులు వేస్తున్న అడుగులు. ముఖ్యమంత్రి స్వయంగా కట్టగట్టుకొని వెళ్లి హైదరాబాద్ నడిమధ్యన నిలబెట్టింది ఒక ‘పొలిటికల్ రాముడిని’. తెలుగు నటుడిగా, కళాకారుడిగా ఎన్టీఆర్ అందరివాడే కావచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, తెలంగాణ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించి, ఇక్కడి అస్తిత్వాన్ని చిట్లగొట్టిన ఆంధ్ర ఆధిపత్య రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ కేవలం కొందరివాడు మాత్రమే. కళలకు, సాహిత్య సాంస్కృతిక వ్యవహారాలకు ఎంతటి ఉన్నత స్థానం ఉన్నదో.. కుటిల రాజకీయాలకు అంతటి హీనమైన చరిత్ర ఉంటుంది. హైదరాబాద్‌లో దశాబ్దాలుగా స్థిరపడిన కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందిన తెలంగాణ బిడ్డలు.. ఆవేశపడకుండా, సహనంతో, విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో నివాసం ఉంటున్న కమ్మ, కాపు సహా సబ్బండ కులాలకు చెందిన ఆంధ్రా బిడ్డలు తెలంగాణ స్థానికులే తప్ప, సెటిలర్లు కాదు. ఇదే విషయాన్ని పలుమార్లు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే ప్రకటించారు కూడా. ఈ గడ్డపై కలిసిపోయిన తెలంగాణ బిడ్డలుగా, వాళ్ల పిల్లల భవిష్యత్తు, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ ఈ తెలంగాణ రాష్ట్రంతోనే ముడిపడి ఉన్నాయి.
పక్కన తమది అనుకునే ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబునాయుడిని, పవన్ కల్యాణ్‌ను ఆయా సామాజిక వర్గాలు గనుక కుల, ప్రాంతీయ అభిమానంతో తెలంగాణకు ఆహ్వానించాలని అనుకొంటే అది ఆత్మహత్యా సదృశమే అవుతుంది. ‘బంగారు కత్తి అని మోజుపడి ఆ కత్తితో మన మెడను మనమే కోసుకోవడం‘ లాంటిదే అవుతుంది. బంధువులపై, కులంపై ఉండే అభిమానం వేరు.. మనం బతుకుతున్న సొంత ఇంటి బాధ్యత వేరు. పవన్ కల్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ బిడ్డలను బలిచేస్తున్నాడు. చంద్రబాబును అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డిని చేతుల్లో ఉంచుకుని, హైదరాబాద్‌ను ఆక్రమించాలని అనుకుంటున్న బీజేపీ పెద్దల కుటిల నీతిని పసిగట్టకపోతే, హైదరాబాద్ సంపదను ఉత్తరాదికి తరలించి, హైదరాబాద్‌ను యూటీగా మార్చి లూటీ చేసినా చేసే ప్రమాదం పొంచి కనిపిస్తున్నది.
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మళ్లీ ఏకమై తెలంగాణపై దాడికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ చంద్రబాబు వర్గ రాజకీయ వ్యవస్థ ఇక్కడుంటే తెలంగాణ మొత్తం ఆగం అవుతుందని గతంలో ప్రజలు వారిని తట్టాబుట్టా సర్దించి ఆంధ్రాకు పంపించారో మళ్లీ ఆ శక్తులనే ఇక్కడికి తీసుకొచ్చి రాజకీయాలు చేస్తామంటే ఎలా? ఆలోచించండి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారం నడిపించిన సమైక్య పాలకులు తెలంగాణను నిలువునా దోచుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇక్కడ తమ బంట్లను, ఏజెంట్లను పెట్టుకొని మళ్లీ దోచుకుంటామంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఇటీవల టీజేఎఫ్ ఆధ్వర్యంలో చేసిన ప్రకటన.. ప్రమాదంలో పడ్డ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం వేసే మరో ముందడుగు. ఆ దిశగా సమాజాన్ని సమన్వయం చేసే తెలంగాణ జర్నలిస్టుల ఉద్యమానికి చేయి చేయి కలుపుదాం.. అస్తిత్వాన్ని పరరక్షించుకుందాం. జై తెలంగాణ
(వ్యాసకర్త:టీజేఎఫ్ ఉపాధ్యక్షుడు)
-రమేశ్ హజారి