చెంచుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించి అడవి బిడ్డల ఆర్థిక స్థిరత్వానికి కృషి చేస్తున్నామని చెప్పారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం నల్లమలలోని అప్పాపూర్ చెంచు పెంటలో ఆమె పర్యటించారు. చెంచులతో ఆమె మమేకమయ్యారు. బాణాలు చేతబట్టి.. చిన్న గుడిసెల్లోకి వెళ్లి వారితో మాటామంతి కలిపి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ పథకాలను వారికి అంకితం చేశారు. తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. పోషకాహారంతో ఆదివాసీలు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
నాగర్‌కర్నూల్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : చెంచుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అ చ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలోని అప్పాపూర్ చెంచుపెంటలో శనివారం గవర్నర్ పర్యటించారు. హెల్త్ స్కానింగ్, మహిళలకు కుట్టు మిషన్ కేంద్రం, ఆ శ్రమ పాఠశాలలో తాగునీటికి సోలార్ పంపుసెట్, అప్పాపూర్, భౌరాపూర్ చెంచు పెంటలకు రెండు ద్విచక్రవాహన అంబులెన్స్‌లు, కమ్యూనిటీ హెల్త్ షెడ్‌ను ప్రారంభించా రు. అలాగే మహిళలకు హైజీనిక్ కిట్లు, ఇప్ప పువ్వుతో త యారు చేసిన పోషక విలువలు ఉన్న మగువ లడ్లు పం పిణీ చేశారు. విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. విల్లంబులు, బాణాలు చేతబట్టారు. చిన్న గుడిసెల్లోకి వె ళ్లారు. పిల్లలు, పెద్దలతో మాటామంతీ కలిపారు. చెంచుల కష్ట సుఖాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెంచుల దరిచేరేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ కోటా నుంచి సైతం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు. చెంచులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజును జీవితంలో మర్చిపోలేనన్నారు. చెంచులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వారి ఆరోగ్యాలు మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో ఆరు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అప్పాపూర్, భౌరాపూర్‌లో చెంచుల ఆరోగ్యం కోసం రెడ్‌క్రాస్, ఈఎస్ఐ, వెటర్నరీ, వైద్య తదితర శాఖల సహకారంతో సహాయక చర్యలు పర్యవేక్షిస్తానన్నా రు. ఆదివాసీల ఉపాధి కోసం ఐటీడీఏ ద్వారా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెటర్నరీ శాఖ ద్వారా అందజేసిన రాజశ్రీ కోళ్ల ద్వారా వచ్చే గుడ్లు, మాంసంతో చెంచులు పౌష్టికాహారం పొందాలన్నా రు. గవర్నర్ కార్యదర్శి సురేంద్ర భవన్ మాట్లాడుతూ చెంచుల కోసం గవర్నర్ తన నిధుల నుంచి రూ.1.50 కోట్లను కేటాయించారన్నా రు. ఆదివాసీల సమీకృత అభివృద్ధికి రెడ్‌క్రాస్, ఈఎస్ఐ తదితర సంస్థల ద్వారా కృషి చేయనున్నట్లు తెలిపారు. చెంచు పెంటల్లోని సమస్యలను కలెక్టర్ ద్వారా పరిష్కరించనున్నట్లు చెప్పారు. అప్పాపూర్, భౌరాపూర్ చెంచు పెం టలకు రూ.49.90 లక్షల చెక్కును గవర్నర్ చేతుల మీదు గా కలెక్టర్ ఉదయ్‌కుమార్‌కు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్రవాహన అంబులెన్స్‌లు, ప్రతి ఇంటికీ సో లార్ విద్యుత్ కనెక్షన్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు, ఐటీడీఏ ద్వారా గిరిపోషణకు పౌష్టికాహారం, ఇండ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. అటవీ ప్రాంతంలో ఉ న్నందున కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, హైదరాబాద్ నుంచి మన్ననూర్ హరితహోటల్ కు గవర్నర్ చేరుకోగా కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్, అదనపు కలెక్టర్ మనూచౌదరి స్వాగతం పలికారు. అక్కడే అల్పాహారం చేశాక.. మొక్క నాటారు. అప్పాపూర్‌కు రోడ్డు మార్గాన చేరుకొన్న గవర్నర్‌కు చెంచులు విల్లంబులు, సాంప్రదాయ వస్త్రధారణతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడారు. స్కానింగ్ కేంద్రంలో మహిళను పరీక్షించారు. పెంటలో ఉన్న ఆలయాన్ని సందర్శించారు. మిషన్ భగీరథ ఇంటింటి న ల్లా కనెక్షన్ ప్రారంభించారు. ఉడిమిళ్ల ఆశ్రమ పాఠశాల వి ద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. గవర్నర్ తొలిసారిగా తెలుగులో ప్రసంగించారు. అమ్రాబాద్ రిజర్వు ఫారె స్ట్ మృగవని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను గవర్నర్ తిలకించారు. అభివృద్ధి కార్యక్రమాలు, నీటి నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ, నిర్వహణ, అ డవుల పునరుద్ధరణ, సంరక్షణ కార్యకలాపాలపై వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, డీఎఫ్ వో కిష్టగౌడ్, ఐటీడీఏ పీవో అశోక్, ఎఫ్‌డీవో రోహిత్ రెడ్డి, డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, ఎంపీపీ గీతాంజలి, సర్పంచులు గురువయ్య, మల్లికార్జున్, డీఆర్డీవో సుధాకర్, డీడబ్ల్యూవో వెంకటలక్ష్మి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
శ్రీశైలం, మార్చి 26 : శ్రీశైల భ్రమరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్లను గవర్నర్ తమిళిసై దర్శించుకున్నా రు. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న ఆమెకు కర్నూల్ కలెక్టర్ కోటేశ్వర్రావు స్వాగతం పలికారు. ఆ లయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ ప్రవేశం చేయించారు. దర్శన అనంత రం అమ్మవారి ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు పలికారు. అనంతరం ఈవో గవర్నర్‌కు స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, శేషవస్ర్తాలను అందజేశారు. గవర్నర్ వెంట కర్నూల్ ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఆత్మకూర్ డీఎ స్పీ శృతి ఉన్నారు.