కొనుగోళ్ల కోసం పడిగాపుల్లో రైతు ఓడిపోతున్నడు. వడ్లో, మక్కలో, జొన్నలో రాశి పోసుకొని ప్రభుత్వం కొనకపో తుందా? అన్న నిరీక్షణలోనే విగత జీవిగా మారుతున్నడు. రైతుల ప్రాణాలు పోతున్నా పంట కొనుగోళ్లను పట్టించుకునే నాథుడే లేడు. కాడి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కాంటా కూడా వదిలేసింది!
ప్రాణాలు తీస్తున్న ఎండలు ఒకవైపు! పంటల్ని ముంచుతున్న వర్షాలు మరోవైపు! నడిమిట్ల ప్రాణాలు పణంగా పెట్టి పడిగాపులు పడుతున్నారు రైతులు. స్పందించని సర్కార్‌ను నమ్ముకొని, కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. చినుకుపడితే వడ్లు తడవకుండా తండ్లాడుతున్నరు. మండుటెండల్లో వడ్లు ఆరబోసుకొని అవస్థలు పడుతున్నరు. పిడుగుపడితే బక్కజీవి ఒక్కసారిగా కుప్పకూలుడే! వడగాలి తగిలితే విగతజీవిగా మారుడే! ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఒకే వెత!
అన్నంపెట్టే రైతన్నకు ఎంతటి దురవస్థ? ఏమి దరిద్రమిది? ఎవరి శాపమిది?
ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో ఇద్దరు రైతులు వరికుప్పలపైనే తనువు చాలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో ధాన్యం కొనుగోలు కోసం నాలుగు రోజులుగా నిరీక్షిస్తున్న గౌరయ్య.. వడగాలికి వడ్ల కుప్పపైనే ప్రాణంవదిలాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో నెలరోజుల క్రితం వడ్లు తెచ్చి పోసిన రైతు నీలం వెంకన్న.. కాంటా వేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాడు. రాష్ట్రంలో కొత్త పథకం.. కల్లాల్లో మరణమృదంగం!బక్కరైతును బలిపీఠం ఎక్కిస్తున్నది ప్రభుత్వం!
రంగారెడ్డి, మే 3 (నమస్తే తెలంగాణ)/కురవి : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సర్కార్ కొనుగోలు చేయకపోవడం రైతుల ప్రాణాల మీదికి తెచ్చింది. నాలుగు రోజులుగా మండుటెండలో నిరీక్షించి ఓ రైతు వడదెబ్బతో వడ్లకుప్పపైనే నేలకొరగగా, నెలరోజులకు ప్రారంభమైన సెంటర్లో కాంటా వేస్తున్న సమయంలో పిడుగుపడి మరో రైతు మృత్యువాత పడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి కొనుగోలు కేంద్రాల్లో ఆదివారం జరిగిన ఈ సంఘటనలు స్థానికంగా తీవ్ర విషాదం నింపాయి. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీల కారణంగా నాలుగు రోజుల నుంచి వడ్లు ఆరబోసి ఎర్రటి ఎండలో పడిగాపులు కాసి చివరికి వడదెబ్బతో రైతు ప్రాణాలు వదిలాడు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించిన రాయపోల్ కొనుగోలు కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయపోల్ గ్రామానికి చెందిన మంగలి గౌరయ్య పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పండించిన ధాన్యాన్ని నాలుగు రోజుల క్రితం అదే గ్రామంలో రాచకొండ మైలారం సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు.
ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నదని, ఆరబెట్టాలని అధికారులు కొనడానికి నిరాకరించారు. ఆరబోసి నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నాడు. ఆదివారం కూడా ఆరబెట్టిన ధాన్యాన్ని తన భార్యతో కలిసి కుప్పనూర్చేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రంగా ఉండడంతో వడ దెబ్బకు గురై వడ్లపైనే కుప్పకూలాడు. వెంటనే తోటి రైతులు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయాడు. నాలుగు రోజలుగా ఎర్రటి ఎండలోనే గౌరయ్య ధాన్యం ఎండబోస్తున్నా అధికారులు కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక రైతులు వాపోతున్నారు. గౌరయ్యకు భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులున్నారు.
రాయపోల్‌లో ఐదు రోజుల క్రితం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని రాయపోల్, ముక్కునూరు, దండుమైలారం, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, నెర్రపల్లి గ్రామాల రైతులు ఈ కేంద్రానికే ధాన్యాన్ని తీసుకొస్తారు. ఐదురోజులుగా ధాన్యం పెద్ద ఎత్తున పోగుపడుతున్నా కొనుగోలు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో రైతులు మండుటెండలో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. ధాన్యానికి గిట్టుబాటు ధర రావాలంటే తేమ శాతం పూర్తిగా పోవాలని అధికారులు కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతులు తాము తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దే ఆరబోసి పడిగాపులు కాస్తున్నారు.
వడ్ల నుంచి తాలు వేరు చేసే మిషన్ కూడా సకాలంలో రాకపోవడంతో ధాన్యాన్ని కల్లాల వద్దే ఆరబోసి కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్యాడీ క్లీనింగ్ మిషన్ కూడా అందుబాటులో లేక పోవడంతో ధాన్యం కొనుగోలుకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఎమ్మెల్యే ప్రారంభించిన కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా కేంద్రాల్లో పరిస్థితి ఏవిధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని రైతులు పేర్కొంటున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకొనేందుకు నెలరోజులుగా అరిగోస పడ్డ మూగరైతు, చివరికి వడ్లు కాంటా వేస్తుండగా పిడుగుపాటుకు గురై చనిపోయాడు. వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నెల రోజుల తర్వాత ప్రారంభమైన సెంటర్లో వడ్లు కాంటా వేస్తుండగా మృతిచెందడం స్థానికులను మరింత కలచివేసింది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సరార్ నిర్లక్ష్యం కారణంగానే మృత్యువాతపడ్డాడని తోటి రైతులు మండిపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లిలో కొనుగోలు కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన నీలం వెంకన్న (40) పుట్టు మూగ. తనకున్న 1.20 ఎకరాల్లో వరి సాగు చేశాడు. నెల క్రితమే తాను పండించిన సుమారు 45 బస్తాల ధాన్యాన్ని కాంపల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తెచ్చి ఆరబోశాడు. సమయానికి కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు రోజుల తరబడి అక్కడే పడిగాపులు కాశారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం కాంటా వేయడం మొదలు కాగా, ఒకసారిగా వాతావరణం మారి గాలి దుమారం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో కొనుగోలు కేంద్రంలో వెంకన్నపై పిడుగుపడటంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అక్కడున్న వారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణం కోల్పోయిన గౌరయ్య అంత్యక్రియలను తక్షణమే పూర్తిచేయాలని అధికార పార్టీ నేతలు బాధిత కుటుంబంపై ఒత్తడి తెచ్చారు అంత్యక్రియలు వెంటనే చేస్తే ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చవచ్చని భావించారు. ఎలాగైనా అంత్యక్రియలు ఆదివారమే పూర్తిచేయాలని బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆలస్యమైనందున సోమవారం పూర్తి చేస్తామని బాధితులు చెప్పినా వారు వినకపోవడం గమనార్హం.