సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త ఏడాదిలో సరికొత్త పాలసీని అమలు చేస్తున్నది. ఈ సంవత్సరం నుంచి లే అవుట్లకు అనుమతి తీసుకునే వారు స్థానికంగా ఉన్న చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకునేలా చూడాలని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలిచి అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తున్న హైదరాబాద్ నగర పరిసరాల్లోని చెరువులను కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌కు సూచించారు. ఈ మేరకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. పచ్చదనం, ఆహ్లాదం కలిగించే కేంద్రాలుగా మలచాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు నిరాదరణకు గురవుతున్నాయి. మురుగునీరు చేరి కాలుష్యకాసారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరువుల తీరు మార్చే బాధ్యతలను స్థానిక డెవలపర్స్‌కు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. లే అవుట్లు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ (ఎంఎస్బీ), గేటెడ్ కమ్యూనిటీ, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చే సమయంలో వారి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్న లేక్స్ అభివృద్ధి బాధ్యతలు వారే నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. జలాశయానికి 500 మీటర్ల విస్తీర్ణం(పరిధి) వరకు వాటి నిర్వహణను సంబంధిత డెవలపర్లు లేదా ఏజెన్సీలు చేపట్టాలని కొత్త పాలసీలో రూపొందించి పటిష్టంగా అమలు చేయాలని పురపాలక శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.