సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ)/జీడిమెట్ల: ఎనమిది నెలల ప్రియుడి ప్రేమ బంధం, కన్నతల్లి పేగు బంధాన్ని తుంచేసింది. తన ప్రేమకు అడ్డు వస్తుందని నేనే అమ్మను చంపేశానంటూ ఏ మాత్రం అదురు, బెదురు లేకుండా విచారణలో వెల్లడించిన ఆ టీనేజి బాలిక మాటలకు పోలీసులు సైతం నివ్వెరపోయారు. జీడిమెట్లలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీససీపీ కె.సురేశ్‌కుమార్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్, డీఐ కనకయ్యలతో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
మహబూబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి షాపూర్‌నగర్‌లోని హెచ్ఎంటీ సొసైటీలో నివాసం ఉంటున్నారు. పెద్ద కూతురు(16) పదవ తరగతి చదువుతుండగా..చిన్నకూతురు (12) 7వ తరగతి చదువుతున్నది. కాగా, పెద్ద కూతురుకి 8 నెలల కిందట నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన డీజే నిర్వాకుడు శివ(19)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. మొదట్లో వీరిద్దరి ప్రేమను అంగీకరించిన తల్లి అంజలి ఇటీవల వ్యతిరేకించింది.
10వ తరగతిలోనే ప్రేమా గీమా ఏందని, మంచిగా చదువుకోవాలని బాలికను మందలించింది. ఈనెల 8న సదరు బాలిక తన సోదరిని వెంట తీసుకొని శివ సొంత ఊరైన నల్లగొండ జిల్లా, కట్టంగూరుకు వెళ్లి, నాలుగు రోజుల తరువాత తిరిగి వచ్చింది. దీనిపై ఆగ్రహించిన అంజలి కూతురిని తీవ్రంగా మందలించింది. దీంతో తలిపై కోపం పెంచుకున్న ఆ బాలిక ఈనెల 19న మళ్లీ ప్రియుడు శివ వద్దకు వెళ్లిపోయింది. మరునాడు బాలిక తల్లి అంజలి తన కూతురిని శివ కిడ్నాప్ చేశాడంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శివతో పాటు బాలికను జీడిమెట్లకు తీసుకువచ్చి ఇరువురిని మందలించి, బాలికను తల్లికి అప్పగించారు.
ప్రేమను వ్యతిరేకించడమే తల్లికి శాపమైంది..
పోలీసుల సాయంతో ఈనెల 22న ఇంటికి చేరిన కూతురిని తల్లి అంజలి గట్టిగా మదిలించడంతోపాటు చేయిచేసుకున్నది. బాలిక ప్రియుడు శివను జైలుకు పంపిస్తానని తీవ్రంగా హెచ్చరించింది. దీంతో తల్లిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసేందుకు పథకం వేసింది. ఈనెల 23న సాయంత్రం శివను షాపూ ర్‌నగర్ పిలిపించిన బాలిక, ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని హత్య చేయాలని కోరింది. అయితే హత్య చేయడానికి శివ నిరాకరించాడు. దీంతో హత్య చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పాటు తన చావుకి నువ్వే కారణం అంటూ లెటర్ రాస్తానని హెచ్చరించింది.
దీంతో శివ ఏం చేయలేక అతని సోదరుడు(16)తీసుకొని సోమవారం సాయంత్రం షాపూర్‌నగర్‌కు వచ్చాడు. సదరు బాలిక ఇంటి ముందు కాపలా కాయగా, శివ అతడి సోదరుడు ఇంట్లోకి వెళ్లి అంజలి మెడకు చున్నీ చుట్టి గట్టిగా ఉరిబిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ మేరకు కేసు నమో దు చేసిన పోలీసులు మంగళవారం కట్టంగూరులో శివను అదుపులో తీసుకోగా, అ తడి సోదరుడిని హైదరాబాద్‌లో అదుపులో తీసుకున్నారు. తల్లి హత్యకు పథకం వేసిన బాలికను పోలీసులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకుని విచారించగా.. తమ ప్రేమకు అడ్డువస్తుందనే అమ్మను ప్రియుడితో కలిసి చంపినట్లు విచారణలో వెల్లడించింది. దీంతో ముగ్గురు నిందితులపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి బుధవారం వారిని రిమాండ్‌కు తరలించారు.
మూడేండ్ల కిందే తల్లిపై ఫిర్యాదు..
మూడేండ్ల కింద 7వ తరగతి చదువుతున్నప్పుడే ఆ బాలిక తన తల్లిపై ఫిర్యాదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. తనను తన తల్లి సరిగ్గా చూసుకోవడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజులపాటు హోమ్‌లో ఉన్నట్లు తెలిపారు. దీంతో చిన్నతనం నుంచే సదరు బాలికకు తల్లిపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.