స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్ వారి నుంచి విముక్తి కోసం మాత్రమే సాగలేదు. భారతదేశాన్ని ప్రజాస్వామ్యంగా, సంక్షేమ రాజ్యంగా నిర్మించుకోవాలనే ఆకాంక్ష నాటి తరంలో స్పష్టంగా ఉన్నది. ఈ స్వాతంత్య్రోద్యమ విలువలే ఆ తరువాత రాజ్యాంగంలో ప్రతిఫలించాయి. దేశ వనరులను ప్రైవేటు కంపెనీలకు తోడి పెట్టడానికి బదులు, ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలనే దిశగానే స్వతంత్ర భారత ప్రస్థానం ఇప్పటి వరకు కొనసాగింది. కానీ, ఇటీవలి కాలంలో దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ, ప్రజా సంక్షేమ పథకాలను ‘ఉచితాలు’ అని అవహేళన చేస్తూ, వాటిని రద్దు చేయాలనే దుర్మార్గపు ప్రచారం మొదలైంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ, సంక్షేమ పథకాల చారిత్రక నేపథ్యాన్ని, అవసరాన్ని వ్యాస రచయిత వివరిస్తున్నారు.
18వ శతాబ్దంలో Laissez -Faire Economic philosophy ప్రతిపాదించిన free market capitalism వలన కొన్ని వందల ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్న వస్తు ఉత్పత్తి, మార్పిడి, సామాజిక నియంత్రణ మొదలైనవి ఆకస్మిక మార్పునకు గురైనవి. దీనివల్ల 19వ శతాబ్దంలో కార్మిక-పెట్టుబడిదారీ వర్గాల మధ్య నిరంతర ఘర్షణ అనేది కొత్తగా మొదలయ్యింది. కార్మిక-పెట్టుబడిదారీ వర్గాల మధ్య ఘర్షణ వలన దేశ ఆర్థిక పరిస్థితి కుంటుబడుతుందని జర్మనీ అధినేత బిస్మార్క్ గమనించారు.
జర్మనీలోని కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాలు, కనీస అవసరాలను తీర్చేందుకు జీతభత్యాలు పెంచాల్సిందిగా పెట్టుబడిదారులను కోరారు. జీతభత్యాలు పెంచితే వస్తువుల తయారీ ధరలు పెరుగుతాయని, దాని వలన ఇతర దేశాల పెట్టుబడిదారుల నుంచి ఎదురయ్యే పోటీని తాము తట్టుకొలేమని, కాబట్టి ఒక స్థాయి దాటి తాము కార్మికుల జీతాలు పెంచలేమని వారు బిస్మార్క్కు తెలిపారు.
కార్మికుల ఆవేదనను, పెట్టుబడిదారుల పరిస్థితులను అర్థం చేసుకున్న బిస్మార్క్.. జర్మనీ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు, కార్మికుల కనీస అవసరాలు తీరుస్తూనే, పెట్టుబడిదారుల మీద భారం పడకుండా ‘సోషల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం’ను ప్రారంభించారు. సోషలిస్టు, కమ్యూనిస్టు విప్లవాల నుంచి స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించే చర్యగా దీనిని చూడవలసి ఉంటుంది. బిస్మార్క్ ప్రతిపాదించిన ఆరోగ్యబీమా బిల్లు-1883, ప్రమాదబీమా బిల్లు-1884, వృద్ధాప్యం, అంగవైకల్య బీమా బిల్లు-1889, కార్మికుల సంరక్షణ చట్టం-1891, పిల్లల రక్షణ చట్టం- 1903 మొదలైనవి కార్మికవర్గాలకు వరంగా మారాయి. బిస్మార్క్ చేపట్టిన ఈ చర్యలు ఆధునిక ఉదారవాద అర్థిక వ్యవస్థలో సంక్షేమరాజ్యానికి (wefare state)కు తొలి అడుగుగా ఆర్థికవేత్తలు అభివర్ణించారు. బిస్మార్క్ను ఆధునిక సంక్షేమరాజ్య పితామహుడిగా కొనియాడారు. మార్కెట్ పెట్టుబడిదారీ విధానం తీసుకొచ్చిన అసమానతలకు విరుగుడు సంక్షేమరాజ్యం అన్న సూత్రీకరణతో అనేక దేశాలు ఇదే బాట పట్టాయి. ప్రైవేటు పెట్టుబడిదారీ మార్కెట్ కార్యకలాపాలు, ప్రభుత్వం చేపట్టే సామాజిక సంక్షేమ చర్యలు ఈ విధంగా విడదీయలేని విధంగా పెనవేసుకుపోయాయి. ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టని దేశం ప్రపంచంలోనే లేదు. ఈ సంక్షేమ రాజ్యం విప్లవాత్మక ఆదర్శవాదం కాదు, అదొక రాజీ పరిష్కారం మాత్రమే. సంక్షేమరాజ్యం అనేది మనం స్వేచ్ఛగా స్వీకరించడానికో లేదా తిరస్కరించడానికో ఉన్న ఒక విధాన ఎంపిక కాదు. ఇది ఆధునిక ప్రభుత్వాల ప్రాథమిక లక్షణం.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలను పొందుపరచటం జరిగింది. ఆదేశిక సూత్రాలు కోర్టుల ద్వారా అమలు చేయబడనప్పటికీ, కేంద్రప్రభుత్వం, అన్ని రాష్ర్టాలు తమ తమ పరిధుల్లో వీటిని పాటిస్తూ చట్టాలు చేయవలసిఉంటుందని రాజ్యాంగం నిర్దేశించింది. రాజ్యం (ప్రభుత్వం) ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజికాభివృద్ధి కొరకు పాటుపడుతూ, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు ఈ ఆదేశిక సూత్రాలు భరోసా ఇస్తాయి.
వీటి ప్రకారం.. రాజ్యం (భారత ప్రభుత్వం) తన పౌరులందరికీ స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా జీవనోపాధి కల్పించాలి. సంపద ఒక దగ్గరే కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో పంపిణీ జరిగేలా చూడాలి. పౌరులకు ఉచిత విద్య వైద్య సదుపాయాలు కల్పించాలి. న్యాయాన్ని కూడా ఉచితంగా అందజేయవలసిన బాధ్యత రాజ్యానిది. పౌరుని దగ్గర డబ్బు లేదని, అతనికి న్యాయం దక్కకపోవడం రాజ్యం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకాలిచ్చి, స్వయంపాలన చేసుకోగలిగే పరిస్థితులను రాజ్యం కల్పించాలి. నిరుద్యోగులు, వృద్ధులు, అనారోగ్య పీడితులు, దిక్కు లేని వారి కోసం రాజ్యమే కనీస వసతులను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు రాజ్యం పాటుపడాలి. ప్రజాసంక్షేమానికి అవసరమైన ఇంకా అనేక విషయాలను ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. వీటి సాధనకు రాజ్యం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. కానీ, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఈ ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నాము అనేది జగమెరిగిన సత్యం.
అభివృద్ధి ఆధారిత అసమానతలను పరిష్కరించటానికి రాజ్యం ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ తన An Uncertain Glory: India and its contradictions అనే పుస్తకంలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిక సూత్రాలను అనుసరించి పథకాలను రూపొందిస్తున్నారు. సుమారు వెయ్యి గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక నిధి, అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్, జిల్లాకో మెడికల్ కాలేజీ, టిమ్స్, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు మొదలైనవి దీంట్లో భాగమే. అంగన్వాడీ నిర్వహణ పద్దును కేంద్రం కుదించినప్పటికీ కేసీఆర్ తెలంగాణలో ఆ రంగాన్ని బలహీనపడకుండా, బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, రైతుబంధు, రైతు బీమా, రైతు రుణ మాఫీ మొదలగు రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించటం ద్వారా రాష్ర్టాన్ని పారిశ్రామికంగానూ అగ్రస్థానంలో నిలిపారు. ఈ విధంగా ‘సంపదను పెంచుతాం-పేదలకు పంచుతాం’ విధానంతో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర జీఎస్డీపీ గణనీయంగా పెరిగింది. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీకి 5 శాతాన్ని అందిస్తున్నది.
ఇక భారతదేశం విషయానికి వస్తే గత 75 ఏండ్లలో కేంద్రప్రభుత్వం రెండుసార్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసింది. 1990లో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రూ.10,000 కోట్ల మేర, 2008లో మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రూ.71,680 కోట్ల మేర రైతు రుణమాఫీ జరిగింది. అంటే మొత్తం రూ.81,680 కోట్లు మాత్రమే. ఇదే 75 ఏండ్లలో దేశంలోని అన్ని రాష్ర్టాలు కలిపి సుమారు 3 లక్షల కోట్ల రుణ మాఫీ చేశాయి. యూపీఏ ప్రభుత్వం పదేండ్లలో ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల రుణాలను రూ.2.2 లక్షల కోట్లు మాఫీ చేయగా మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలోనే రూ.10.7 లక్షల కోట్లు మాఫీ చేసింది. రైతు రుణమాఫీ తప్పు అని ప్రచారం చేసే మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ రుణ మాఫీకి మాత్రం write off అనే పేరు పెట్టి అమలు చేస్తున్నది. కార్పొరేట్ టాక్స్ 2014లో సుమారు 34 శాతం ఉండగా మోదీ 2022 నాటికి 25 శాతానికి తగ్గించారు. రైట్ ఆఫ్ వల్ల, తగ్గించిన కార్పొరేట్ టాక్స్ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయటానికి సెస్సులను పెంచి జనాల జేబులకు చిల్లు పెడుతున్నది మోదీ ప్రభుత్వం. 2014లో మొత్తం కేంద్రప్రభుత్వ రాబడిలో సెస్సుల వాటా 10 శాతం ఉండగా, ఇప్పుడు 20 శాతానికి పెరిగింది. అంటే, ఆ మేరకు జనంపై భారం మోపినట్లు.
మోదీ ఏప్రిల్ 2020లో ప్రవేశపెట్టిన Production Linked Incentive Scheme (PLI) అనేక లోపాలతో ఉన్నదని ప్రఖ్యాత ఆర్థికవేత్త రఘురాం రాజన్ 5th AIPC National conferenceలో అభిప్రాయపడ్డారు. పీఎల్ఐలో చేరుతున్న పరిశ్రమల సంఖ్య పెరుగుతున్నదని, ఇది 1991 కన్నా ముందున్న లైసెన్స్రాజ్ను గుర్తు చేస్తోందని అన్నారు. పరిశ్రమలను ఏ ప్రాతిపాదికన పీఎల్ఐలో చేరుస్తున్నారో తెలియడం లేదని, అది దేశానికి ప్రమాదకరం అని హెచ్చరించారు. పీఎల్ఐ పథకం కింద 2022 బడ్జెట్లో పరిశ్రమలకు 4-6 శాతం ప్రోత్సాహకాలు ఇవ్వడానికి రూ.1.97 లక్షల కోట్లు కేటాయించడం, మరోవైపు ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడడం మోదీ ద్వంద్వనీతిని తెలియచేస్తోంది.
ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతలను ఉచితాల కింద చూపి వ్యతిరేకించటం, కార్పొరేట్ శక్తులకు మేలు చేయడం అనే ప్రక్రియను గమనిస్తే.. ఇటలీ ఫాసిస్టు నియంత ముస్సోలినీ వ్యాఖ్య గుర్తుకు వస్తుంది. ‘రాజ్యం, కార్పొరేట్ కంపెనీల కలయికే కార్పొరేట్స్వామ్యం. ఇదే ఫాసిజం’ అని ముస్సోలినీ చెప్పాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రెండు రకాల దాడులు ఎదుర్కొంటూ ఉంటాయి. కమ్యూనిస్టులు మరియు సోషలిస్టులు సంక్షేమం ఖర్చు తక్కువగా ఉన్నదని, ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టదని విమర్శిస్తారు. రైటిస్టులు సంక్షేమ పథకాలతో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, ఇది దేశానికి మంచిది కాదని గోల చేస్తారు. కానీ, ఇదే రైటిస్టులు కార్పొరేట్ కంపెనీలకు ఎన్ని నిధులు ఇచ్చినా విమర్శించరు పైగా స్వాగతిస్తారు.
నోబెల్ గ్రహీతలు అభినవ్ బెనర్జీ, ఈస్తర్ డఫ్లో రచించిన Good Economics for Hard Times పుస్తకంలో సోషల్ వెల్ఫేర్ అనే అధ్యాయంలో 100 దేశాలలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పరిశీలించి.. నగదు బదిలీల వలన ప్రజలు తక్కువ పని చేస్తారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా నగదు బదిలీలు, ప్రభుత్వాలు అమలు చేసే ఇతర సంక్షేమ పథకాల వలన ప్రజల ప్రాథమిక జీవన ప్రమాణాలు పెరుగుతాయని, తద్వారా వారు ఉత్పాదక కార్మికులు అవుతారని, సంపద సృష్టికి కారణం అవుతారని తెలియజేశారు.
రైతు బంధు, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీరు తదితర సదుపాయాల కల్పన వల్ల తెలంగాణలో 2014లో రూ.80 వేల కోట్ల Gross value added (GVA) గా ఉన్న వ్యవసాయం ప్రస్తుతం రూ.2.2 లక్షల కోట్లకు చేరుకున్నది. దళితబంధు కూడా రాబోయే పదేండ్లలో ఇలాంటి అభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఉంది.
ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా ప్రయోజనాలు చేకూర్చడం మీద చర్చ మొదలైందో, దాన్ని పక్క దారి పట్టించడం కొరకు, బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై చర్చ కొత్తగా మొదలైంది. ఉచితాలపై మధ్య తరగతిలో కోపం రాజేసి, వారి దృష్టిని కార్పొరేట్ ఉద్దీపనల నుంచి మరల్చే ప్రయత్నంగా దీనిని చూడవలసి ఉంటుంది. సంక్షేమ పథకాలు పేదల కంటే మధ్యతరగతి అభ్యున్నతికే ఎక్కువ ఉపయోగపడతాయని రాబర్ట్ గూడిన్ తన పరిశోధన పత్రం Not only poor : the middle classes and the welfare Stateలో తెలియజేశారు.
రాజ్యాంగం ప్రకటించిన సమానత్వాన్ని సాధించే వరకు సంక్షేమ పథకాలు ఉండవలసిందే. సంక్షేమ పథకాల రూపకల్పన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత.
– పెండ్యాల మంగళాదేవి