దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. గత ఏడాది 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.58,750 ఎగిసింది. ఇక కిలో వెండి రేటు రూ.1,49,300 ఎగబాకింది. ఈ క్రమంలో ఆల్‌టైమ్ హై రికార్డులూ నెలకొన్నాయి. అయితే ఈ ఏడాదీ ఇదే జోరు కొనసాగుతుందా? లేదా? అన్న దైలమాలో ఇప్పుడు మదుపరులున్నారు.
బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ఉన్న సాంకేతిక అంశాలను పరిశీలిస్తే.. ద్రవ్యోల్బణం పెరిగి, అంతర్జాతీయంగా ఉద్రిక్తకర పరిస్థితులే కొనసాగితే రేట్లు ఇంకా విజృంభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైతే మదుపరులు తమ పెట్టుబడులను బంగారం, వెండి వైపునకు మళ్లిస్తారని.. ఇది కూడా ధరలను ఎగదోస్తుందని అంటున్నారు. అయితే అమెరికా డాలర్ బలపడి, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే మాత్రం ధరల్లో దిద్దుబాటుకు అవకాశం ఉన్నదని చెప్పవచ్చు.
కానీ సెంట్రల్ బ్యాంకులతోపాటు భారతీయులు, చైనీయులు బంగారం కొనుగోళ్లను కొనసాగిస్తారు కాబట్టి మన పెట్టుబడులు సురక్షితమేనన్న అభిప్రాయాలనూ వెలిబుచ్చుతున్నారు. ఇక వెండికి పరిశ్రమల నుంచి డిమాండ్ ఉంటుందని, ఆశించిన స్థాయిలో మార్కెట్‌కు సరఫరా కష్టమేనని అంటున్నారు. దీంతో మున్ముందూ వెండి ధరలు పరుగులు పెట్టడం ఖాయమేనన్న అంచనాలనైతే వేస్తున్నారు. అయినప్పటికీ మదుపరులు ఒడిదుడుకులకు సిద్ధంగా ఉండాల్సిన అవసరమే ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో వడ్డీరేట్ల కోతలు: ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను గత ఏడాది 3.50-3.75 శాతానికి తగ్గించింది. దీంతో అమెరికా కరెన్సీ డాలర్ బలహీనపడింది. ఫలితంగా ఇతర దేశాలు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయి. మార్కెట్లో పెరిగిన డిమాండ్ ధరలను పరుగులు పెట్టించింది.
అంతర్జాతీయ ఆందోళనలు: మిడిల్ ఈస్ట్‌లో సంఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. మదుపరులలో భయాలను పెంచాయి. స్టాక్ మార్కెట్ వంటి రిస్కీ పెట్టుబడులకు దూరం జరిగి.. బంగారం వంటి సురక్షిత పెట్టుబడులకు దగ్గరయ్యారు. ఇది రేట్లను ఎగదోసింది.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు: భారత్ సహా ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు.. బంగారాన్ని పెద్ద ఎత్తున కొంటున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకునేందుకు రక్షణ కవచంగా గోల్డ్ రిజర్వులను పెంచుకుంటున్నాయి. దీంతో పసిడి మరింతగా ప్రియమవుతున్నది.
వెండికి పారిశ్రామిక డిమాండ్: వెండిని సోలార్ ప్యానెల్స్, విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలోనూ వెండిది కీలకపాత్రే. దీంతో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా లభ్యత లేకపోవడంతో మార్కెట్లో వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అలాగే వెండిని అమెరికా ‘క్రిటికల్ మినరల్’గా వర్గీకరించింది. మరోవైపు చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇక సాధారణ కొనుగోలుదారులతోపాటు మదుపరులు వెండిని పెట్టుబడి సాధనంగా ఎంచుకుంటున్నారు. ఇది కూడా ధరలను ఎగదోస్తున్నది.
వెండి: 2020 డిసెంబర్లో కిలో వెండి ధర రూ.65,604గా ఉన్నది. ఇప్పుడు రూ.2,50,000. దీంతో ఐదేండ్ల కిందట లక్ష రూపాయలను పెట్టుబడిగా పెడితే.. నేడు దాని విలువ దాదాపు రూ.3.75 లక్షలు. మదుపరులకు దాదాపు 300 శాతం లాభాలున్నాయి. 2024 ముగింపుతో చూస్తే 2025లో వెండి రేటు 190 శాతం పెరిగింది.
బంగారం: 2020 డిసెంబర్లో 10 గ్రాముల బంగారం రేటు రూ.49,712. ఇప్పుడు రూ.1,41,700. ఫలితంగా ఐదేండ్ల కిందట లక్ష రూపాయలను పెట్టుబడిగా పెడితే.. ఇప్పుడు దాని విలువ సుమారు రూ.2.84 లక్షలు. ఇన్వెస్టర్లకు ఇంచుమించుగా 190 శాతం లాభాలున్నాయి. 2024 ఆఖరుతో పోల్చితే 2025లో బంగారం విలువ 80 శాతం ఎగిసింది.
నిఫ్టీ 50: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపైనా మదుపరులు బాగానే ఆర్జించారు. అయితే బంగారం, వెండిలతో పోల్చితే మాత్రం తక్కువేనని చెప్పవచ్చు. 2020లో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టినైట్టెతే.. అదిప్పుడు దాదాపు రూ.1.94 లక్షలుగా ఉన్నది. గత ఏడాది నిఫ్టీ సూచీ దాదాపు 8-9 శాతం పుంజుకున్నది.