జడ్చర్ల : పేదలకు వైద్యం అందుబాటులో కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల(Medical College)ను నెలకొల్పుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(Mla Laxma Reddy) తెలిపారు. తెలంగాణ అవిర్భావ, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్కార్ దవాఖానల్లోనే డయాలసిస్ సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, బస్తీ దవాఖానాలు, టీ డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల స్థాయి పెంపుతో రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. టీ డయాగ్నిస్టిక్ సెంటర్లో (Diagnostic Center)55 రకాలకు పైగా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే జడ్చర్ల లో వంద పడకల దవాఖానను ప్రారంభించుకున్నామని వివరించారు. ఐసీయూ, ఎమర్జెన్సీ కేర్ వంటి సేవలతో పేదలకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
గతంలో ప్రభుత్వ దవాఖానాలకు ఎర్ర గోలి పచ్చ గోలి తప్ప సరైన వైద్యం కూడా అందేది కాదన్నారు. ప్రస్తుతం దవాఖానలో వైద్య సేవలు ఎలా ఉన్నాయో ప్రజలే గమనించాలన్నారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.