న్యూఢిల్లీ: తన నిర్ణయాలను తమవిగా చేసుకుని కొందరు క్రెడిట్ చేసుకుంటున్నారని భారత సీనియర్ ఆటగాడు అజింక్య రహానే అన్నాడు. 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనపై రహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై పరోక్షంగా విమర్శలు చేసినట్లు తెలుస్తున్నది. ఆస్ట్రేలియా టూర్ తొలి టెస్టులో భారత్ (36 పరుగులకు ఆలౌట్) ఘోర పరాజయం చవిచూసింది. అనంతరం విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశం చేరుకోగా.. క్లిష్ట పరిస్థితుల్లో రహానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ద్వితీయ శ్రేణి జట్టుతో ఆసీస్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపిస్తూ ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-1తో కైవసం చేసుకుంది. వరుసగా రెండో సారి ఆసీస్‌పై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమ్ఇండియా కొత్త చరిత్ర లిఖించింది. ఈ నేపథ్యంలో ‘బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా’ కార్యక్రమంలో భాగంగా రహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ఆస్ట్రేలియా పర్యటనలో నేను ఏం చేశానో అందరికీ తెలుసు. ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయం గురించి చెప్పుకుని.. క్రెడిట్ కొట్టేయాలనుకునే వ్యక్తిత్వం నాది కాదు. మైదానంలో.. డ్రెస్సింగ్ రూమ్‌లో నేను తీసుకున్న నిర్ణయాలతోనే భారత్ గొప్ప విజయాలు సాధించింది. కానీ వాటి క్రెడిట్ వేరువాళ్లు తీసుకుంటున్నారు. నాకు సిరీస్ నెగ్గడమే ముఖ్యం. అది చరిత్రాత్మక సిరీస్. నాకు చాలా ప్రత్యేకం. సిరీస్ అనంతరం మీడియా ఎదుట తామే గెలిపించామని కొందరు క్రెడిట్ చేసుకున్నారు. కానీ మైదానంలో నేను సొంత నిర్ణయాలు తీసుకున్నా. ఎవరూ నాకు ఇది చేయమని చెప్పలేదు. నేనెప్పుడు నా గురించి గొప్పలు చెప్పుకోను’అని కొంత అసహనంతో అన్నాడు.
విని నవ్వుకుంటా..
నా ఫామ్‌పై వస్తున్న విమర్శలను విని నవ్వుకుంటా. క్రికెట్ గురించి తెలిసిన వారెవరూ అలా మాట్లాడారు. నేనేంటో అందరికీ తెలుసు. ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో మీక్కూడా తెలుసు. ఆసీస్ పర్యటనకు ముందు.. తర్వాత నేను ఎంతో చేశా. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో. ఆసీస్ పర్యటన నా కెరీర్లో మరచిపోలేనిది. నా సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉంది. గత ఫామ్ అందుకుని బ్యాట్‌తో సత్తా చాటగలను. నాలో చాలా క్రికెట్ మిగిలి ఉంది’ అని తెలిపాడు. గతేడాది 13 టెస్టులు ఆడిన రహానే 479 పరుగులు చేశాడు.