ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణకు దాశరథి కృష్ణమాచార్య(Dasarathi) అత్యంత ఆప్తుడని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (MLC Deshapati Srinivas) అన్నారు. తెలంగాణ పేద ప్రజల ఆర్తియే ఆయన కవితకు చమురని చెప్పారు. తన కవిత్వంలో తెలంగాణ తల్లి భావనకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని కొనియాడారు. దాశరథి కృష్ణమాచార్య శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు.
తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాశరథి అక్షరాల నిండా పేద ప్రజల ఆర్తి నిండి ఉందని అన్నారు. వర్తమాన కల్లోల సమాజాన్ని తన రచనల్లో వ్యాఖ్యానించి ప్రజల నాలుకలపై నిలిచిన ప్రజాకవి దాశరథి అని కీర్తించారు. కవిగా, రచయితగా, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడిగా సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు.
తెలుగు, ఉర్దూ, సంస్కృతం వంటి భాషల్లో ప్రావీణ్యం కలిగి, ప్రజా ఉద్యమాలలోనే కాకుండా సినీ గేయ కవిత్వంలో సైతం 2,500 కు పైగా గీతాలను రచించడం వారి ప్రతిభకు నిదర్శనమని అన్నారు. దాశరథి ఆశయాలను యువతరమే ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ సుందర భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశిం మాట్లాడుతూ ఒక కవి రూపొందేందుకు చుట్టూ ఉన్న ప్రజల ఆరాటపోరాటాలు, ప్రజా ఆకాంక్షలు, నిర్ధిష్ట స్థల, కాలాల ప్రభావాలు ఉంటాయని, ఆ విధంగా తెలంగాణను చైతన్యం చేసే దీప్తిగా దాశరథి పుట్టుకొచ్చాడని అన్నారు. ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ తెలంగాణ జన జీవితాన్ని తన రచనల్లోకి ఒంపి, ఈ తెలంగాణ రైతులదని సగర్వంగా చాటిన ఘనత దాశరథికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రఘు, డాక్టర్ మహేందర్, డాక్టర్ చంద్రయ్య, డాక్టర్ నరేందర్, పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.