నిజామాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఉద్రిక్త పరిస్థితులకు బీజేపీ కుట్ర కోణం ఉన్నట్టు ప్రజలు భావిస్తున్నారు. సామరస్య వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకొనేందుకు కమలం పార్టీ ఆడిన నాటకమని పేర్కొంటున్నారు. ఆయావర్గాల మధ్య చిచ్చు రాజేసి పైశాచిక ఆనందం పొందాలనే భారీ కుట్ర వెనుక కీలక నేతలు ఉన్నట్టు పోలీసులు సైతం అంచనా వేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున శివాజీ విగ్రహ స్థాపనతో మొదలైన చిన్నపాటి గొడవ నిమిషాల్లోనే వివాదంగా రాజుకోవడంలో బీజేపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరిగినట్టు తెలుస్తున్నది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఘటన జరిగిన నిమిషాల్లోనే సోషల్‌మీడియాకు ఎక్కడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన యూట్యూబ్ చానల్లో మాట్లాడిన విద్వేషపూరిత వ్యాఖ్యలతో ఓ వర్గం రోడ్డెక్కింది. మరో వర్గం పోటీగా బయటికి రావడంతో ఘర్షణ తలెత్తింది.
టీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీలు సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతున్నాయి. బోధన్ మున్సిపాలిటీ సైతం ఎమ్మెల్యే షకీల్ చొరవతో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 29న బోధన్ మున్సిపాలిటీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో 6 విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తదనుగుణంగానే కౌన్సిల్ తీర్మానం జరిగింది. బసవేశ్వర, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, శివాజీ మహరాజ్ విగ్రహాల ఏర్పాటుపై నిర్ణయం జరిగింది. ఎప్పుడు, ఎక్కడ వీటిని ఏర్పాటుచేయాలనే అంశంపై సందిగ్ధత నెలకొన్నది. ఈ వ్యవహారంపై ఆయా వర్గాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు చర్చలు చేస్తున్నారు. సామరస్యంగానే విగ్రహాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకొనేందుకు ఏకతాటిపై ఉన్న సమయంలోనే కొంతమంది దుండగులు శివాజీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే స్థాపించడంతో వివాదం రాజుకొన్నది. కలెక్టర్ అనుమతి రాకముందే విగ్రహాన్ని స్థాపించడం వెనుక ఆయా వర్గాల మతలబు ఏమిటన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బోధన్‌లో అశాంతిని సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఆలోచనతోనే బీజేపీ శక్తులు ఈ వ్యవహారాన్ని నడిపించినట్టు స్పష్టంగా అర్థం అవుతున్నది. ఆది, సోమవారాల్లో సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్టయింది.
బోధన్‌లో నిజామాబాద్ సీపీ కేఆర్ నాగరాజు నేతృత్వంలో పీస్ కమిటీ సమావేశానికి ఇరు వర్గాల ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. ‘మేమంతా ఒక్కటే.. ఎవడో వచ్చి పుల్లలు పెట్టి రెచ్చగొడుతున్నారు’అంటూ వాపోయారు. అసలు దోషులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. స్పందించిన సీపీ.. కారకులపై చర్యలుంటాయని హామీ ఇచ్చారు. కాగా, బోధన్‌లో బీజేపీ వర్గం పాత వీడియోలను వ్యాప్తి చేస్తూ రెచ్చగొడుతున్నది. సోమవారం పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఆదివారం ఘటనపై ఇరువర్గాలకు చెందిన 15 మందిని అరెస్టు చేశారు.