దేశంలో 2023-24లో జరిగిన ఎన్నికలు వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కేంద్రంలో ప్రధానిగా మోదీ స్థిరపడితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలిచి చంద్రబాబునాయుడు రెండోసారి ఆ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఈ ఫలితాలను చూసి దేశంలో అంతా తీవ్రమైన ఆశ్చర్యానికి (షాక్) గురి అయ్యారు. ఎందుకంటే అవి పూర్తిగా ఊహించని ఫలితాలు, ఎందుకో విశ్లేషిద్దాం.
2014 నుంచి బీజేపీని నడుపుతూ సంపన్నవర్గాలను పెంచుతూ, మధ్యతరగతి, పేద ప్రజలను అనేక కష్టాలకు గురి చేసిన మోదీ మళ్లీ ఎలా గెలిచాడు? ప్రస్తుత గణాంకాల ప్రకారం భారత జనాభా అంచనా 148 కోట్లు. ఇందులో 19 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు సర్వేల అంచనా. మోదీ పదేండ్ల పాలనలో దేశంలో కుబేరులు పెరిగి ప్రపంచస్థాయి జాబితాలో స్థానాలు సంపాదించి ఇండియా షైనింగ్ అనే నినాదాన్ని నిజం చేస్తే, 19 కోట్లకు తోడు మరో 20 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువకు జారిపోయారు. అంటే మొత్తం జనాభాలో 26.3 శాతం ప్రజలు! తాను గెలిస్తే విదేశాల్లోని నల్లధనం దేశంలోకి రప్పించి, ప్రతి మనిషికి 15 లక్షల రూపాయలు ఇస్తానని మొట్టమొదటి ప్రమాణం చేసిన మోదీ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయా రాష్ర్టాలలో తను చెప్పిన ప్రమాణాల వరకు సామాన్య ప్రజల జీవితాలు క్రమంగా కష్టతరం చేశాడు. నోట్ల రద్దుతో నిరుద్యోగం పెరిగితే, ప్రజలను జీఎస్టీ నిలువు దోపిడీకి గురి చేస్తున్నది. అన్ని వర్గాలకు ఈ నష్టాలు వాటిల్లాయి. రైతు లు, ఉపాధ్యాయులు, మహిళలు, నిరుద్యోగులు, అందరూ ఆ కష్టనష్టాలు అనుభవిస్తున్నారు.
ఎన్నికల వ్యవస్థ నుంచి మొదలుకొని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, న్యాయవ్యవస్థ, రాష్ర్టాల హక్కులు, అన్నీ కేంద్రీకృతమయ్యాయి. మీడియా సంస్థలను నిర్వీర్యం చేసి, వాటిపై ఆధిపత్యం సాధిస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ మోదీ పాలన యథేచ్ఛగా సాగిపోతున్నది. ఆయన చర్యలు సామాన్యుల పాలనగా కాకుండా, కేవలం రెండు విషయాల్లో మాత్రమే నడుస్తున్నది. కేంద్ర, రాష్ర్టాల్లో విపక్షాలను, బలమైన నేతలను నాశనం చేయటం, ఆత్మీయులైన కార్పొరేట్ వ్యాపార వర్గాలకు దేశంలోని సంపదను దోచిపెట్టడం! వీటితో సమానంగా మోదీ సాధించిన విజయం.. దేశంలో వివిధ మతాల మధ్య ఆరిపోని విద్వేషాలు రగిలించటం.
అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్యాలన్ని మహాభారతంలో దుర్యోధనుడు చూపించినట్టు ఇప్పుడు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నది. మరి ఇంత నష్టం జరుగుతున్నా మోదీ మళ్లీ మళ్లీ ఎలా గెలుస్తున్నాడు? ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఈ లక్షణాలన్నీ ఉన్న మోదీకి తీసిపోని చంద్రబాబు పార్టీ టీడీపీ, ఎక్కువ గుర్తింపులేని బీజేపీ, ఒక అంతులేని అజ్ఞానం కలిగిన నాయకుడి పార్టీ జనసేన ఒకే కూటమిగా ఏర్పడి 2024లో ఎన్నికల్లో గెలిచారు.
కేంద్రంలో మోదీకి చంద్రబాబు మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు వారిద్దరి మధ్య క్విడ్‌ప్రోకో నడుస్తున్నది. సామ దాన భేద దండోపాయాలతో 29 గ్రామాలను గుంజుకున్న సస్యశ్యామల ప్రాంతం, ఇంద్రుడి అమరావతిని తలపించే రాజధాని కడుతానని ప్రమాణం చేసిన చంద్రుడు తన ఐదేండ్ల పాలన కాలంలో కనీసం శాసనసభా శాశ్వత భవనమైనా పూర్తి చేయలేదు. ఎన్నికల ప్రమాణాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మరి రెండోసారి గెలువని ఈ మోసకారిని ప్రజ లు మూడోటర్మ్లో ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకున్నారు? అసలు ఎందుకు ఎన్నుకున్నారు?
ఇక తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి రాయాలంటే గోటీలు, పేగులు, తొండలు గుర్తుకువస్తాయే కానీ, ఇంకా ఏ విషయాలూ గురుకురా వు. 2014 నుంచి 2023 వరకు జరిగిన దానికి భిన్నంగా చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు. రైతులకు కేసీఆర్ నీళ్లు, పెట్టుబడి సాయం, ఎరువులు, నిరంతరాయ విద్యుత్తు ఇస్తే, అవి ఇప్పుడు ఆగిపోయాయి. పేదలకు కేసీఆర్ రెండు పడక గదుల ఇండ్లు కట్టియిస్తే, తను వేరేగా పాలన చేయాలని భావిస్తున్న రేవంత్‌రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజలు సొంతంగా కట్టుకున్న వేల ఇండ్లను కూల్చేసి తన మాట నిలబెట్టుకుంటున్నాడు. కేసీఆర్ అన్ని పథకాలు ఇచ్చేయగా, ఇంకేమీ మిగలనందున, తను వేరుగా చెయ్యాలని రేవంత్‌రెడ్డి అందాల పోటీలు, ప్రపంచ గుర్తింపు పొందిన ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీతో ఫుట్‌బాల్ ఆట ప్రజలకు చూపిస్తున్నాడు.
బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లినా, కేసీఆర్‌ను మర్చిపోకుండా కలవరిస్తూ, ఆయన పాలన గురించి విమర్శిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏండ్ల తరబడి తెలంగాణను దోచుకున్న టీడీపీతో అంటకాగి, రాష్ర్టావతరణను వ్యతిరేకిస్తూ, ప్రజలు ఉద్యమం చేస్తున్నప్పుడు వారిపై తుపాకీ తీసుకుని బయలుదేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ సిద్ధించిన తర్వాత స్వపరిపాలన ఫస్ట్ టర్మ్‌లో సేదతీరుతున్న ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి తన గురువు పంపితే రూ.50 లక్షల నజరానా ఇస్తూ అడ్డంగా, రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన దొంగ.. ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎట్లా గెలిపించారు? గెలిచాక ఆయన ఏం చేస్తున్నాడో వారు అసలు గమనిస్తున్నారా?
ప్రస్తుత ముఖ్యమంత్రి పాపం తన కోసం పదవి కోరుకోలేదు! వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్‌ను ఏడు మీటర్ల లోతులో ఖననం చేసి, తెలుగుదేశం పార్టీని మళ్లీ తెలంగాణలో అధికారంలోకి తెచ్చి, చంద్రబాబును మళ్లీ ఇక్కడ ముఖ్యమంత్రిని చేసి, ఆయన కండ్లల్లో ఆనందం చూడాలని చాలా తాపత్రయపడుతున్నాడు శిష్యరత్నం రేవంత్!
మరి రేవంత్ భాష, భావాలు, వ్యక్తిత్వం, చేష్టలు తెలిసిన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఆయన గెలిచాడు! గెలిచిన తర్వాత మొట్టమొదటి ఆశయం తొమ్మిదిన్నరేండ్లు అద్భుత పాలన చేసి, అన్ని వర్గాలను సమంగా చూసి ప్రజాహిత పాలన చేసిన కేసీఆర్, ఆయన పార్టీని మట్టుపెట్టడం! సిట్లు, స్టాండ్లు, సీబీఐలు, ఈడీలు అన్ని వ్యవస్థలు మోదీ గుప్పెట్లో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ పథకాలు అవినీతిమయం అని ముద్రవేసేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. మరి న్యాయం ఎటువైపు ఉన్నది, ఎవరు తమకు మేలు చేశారు అన్నది తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారా? మోదీకి నెహ్రూ భజన, చంద్రబాబుకు జగన్మోహన్రెడ్డి భజన, రేవంత్‌రెడ్డికి కేసీఆర్ నామస్మరణ ఎందుకు అవసరమో తత్వవేత్తలు విశదంగా చెప్పారు. ఆ విషయాలను పరిశీలిద్దాం.
షోపెన్‌హావర్ అనే జర్మన్ తత్వవేత్త (1788-1860) మానవమేధ, వివిధ స్థాయిలు, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారు అనేది వివరించాడు. నకారాత్మక బుద్ధి మూడు స్థాయిల్లో ఉంటుంది. 20 ఏండ్లలోపు వారిని అమాయకులుగా పరిగణిస్తారు. 21-49 ఏండ్ల మధ్య వయసు గల వారిని తెలివితక్కువ వారిగా పరిగణిస్తారు. 50-70 ఏండ్ల వరకు ఆలోచనలు మారకుండా, లోకం పోకడ అర్థం చేసుకోకుండా ఉండేవారిని మూర్ఖులు అంటారు. అంటే 50 ఏండ్ల లోపు.. మనుష్యులను అర్థం చేసుకోలేని, మంచి, చెడూ వేరు చేసి చూడగలిగే నైపుణ్యం పెంచుకోనివారు ఇంక తారస్థాయికి చేరినట్టే! షోపెన్‌హావర్ చెప్పినట్టు ఒక పని చేయాలంటే మేధావులకు , అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.
ఏదైనా పథకం రూపొందించాలంటే ఆ పథకం ఎవరికి, ఎందరికి ఉపయోగపడుతుంది? దాని వలన ఎవరికైనా నష్టాలు కలుగుతాయా? అన్ని ప్రశ్నలతో సతమతమయ్యి వాటన్నిటికీ జవాబుల కోసం అన్వేషిస్తారు, నిపుణులతో చర్చిస్తారు, ఆ రంగంలో రాసిన పుస్తకాలు చదువుతారు. ఇన్ని దిశల్లో ఆలోచిస్తేనే ఆ పథకం, ఆలోచన ఆచరణలో విజయవంతమవుతాయి. మరి మూర్ఖుడు ఏం చేస్తాడంటే, అతనికి ఒకవేళ ఆలోచన అనేది ఉన్నా, అది ఒక దిశలోనే నడుస్తుంది. దీనికి పైన చెప్పిన రచయిత ఇలా అంటాడు Stupid people are not aware of their stupidity; lacking the potential to understand complex issues related to that topic, they try to simplify it in their own way అంటే తెలివి తక్కువ వాళ్లకు, మూర్ఖులకు తాము అటువంటి వారమని తెలియదు. అందుకే అన్ని ఆలోచనలను వారి పరిధిలో ఆచరిస్తారు అని!
పైగా వీరికి ఆ లోతుపాతులు తెలియవు కాబట్టి చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. దీనికి ఉదాహరణ.. తెలంగాణలో ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్య పథకం. ఆ స్కీమ్ వల్ల మిగతా ప్రయాణికులకు అసౌకర్యమే కలుగుతున్నది. అంతేకాకుండా, ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల్లో 369 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఎవరి పాపం? ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మోదీ నోట్ల రద్దు పథకంతో దాదాపు రూ.35 కోట్ల మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. నోట్ల రద్దు సమయంలో మోదీ చెప్పినట్టుగా అవినీతి ఆగలేదు, ఉగ్రవాదం పోలేదు. అలాగే ఉన్నత ఉద్యోగాల్లో వారి అనుభవం, ప్రజ్ఞ చూసి కాకుండా, తమ పార్టీకి చెందిన వారిని నియమించటంతో అన్ని రంగాలు నష్టపోయాయి. ముఖ్యంగా దేశంలోని విద్యారంగం నాశనమయ్యింది.
ఇక చంద్రబాబు మానస పుత్రికల లాంటి పథకాల చేదు ఫలితాలు ఆంధ్ర ప్రజలు ఇప్పుడే రుచి చూస్తున్నారు. అమరావతికి దాదాపు రెండు లక్షల ఎకరాల పంట భూమిని బలిపెడుతున్నాడు. అక్కడ ఒక్క భవనం కూడా పూర్తి కాకుండానే ఇంకా వేలాది ఎకరాలు సేకరిస్తానని చెప్తున్నాడు. ఇక పోలవరం పట్ల నిర్లక్ష్యం, అన్ని సంస్థలు, మెడికల్ కాలేజీలనూ వదలకుండా ప్రైవేట్‌కు కట్టబెడుతున్నాడు.. స్వయం ప్రకటిత విజనరీ.
బహుశా అమరావతిలో రెండు లక్షల ఎకరాలు పీపీపీ మాడల్‌లో సంపద సృష్టిస్తాడేమో! విచిత్రం ఏంటంటే, చెత్త బండి నడిపేవాడిని పలకరించినట్టు పబ్లిసిటీ స్టంట్స్ చేసే చంద్రబాబు, భోగాపురం విమానాశ్రయం మాత్రం చూడటానికి వెళ్లడు. ఎందుకంటే అది జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించినది కాబట్టి. అదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయి. ఇక పైకి చెప్పకపోయినా తెలంగాణలో రెండేండ్ల రెండు నెలల నుంచి పీపీపీ పద్ధతే నడుస్తున్నది. ఇందులో మొదటి పబ్లిక్ అంటే ముఖ్యమంత్రి స్కాములు, ప్రైవేట్ అంటే ఆయన అన్నదమ్ముల కబ్జాలు, బెదిరింపులు, పార్ట్నర్షిప్ అంటే నిశ్శబ్ధంగా నిరాసక్తంగా భరించే ప్రజలు!
మరి ఈ విధమైన రేవంత్ తరహా ప్రవర్తన గురించి తత్వవేత్తలు కూడా రాశారు. ఇటాలియన్ తత్వవేత్త నికోలో మాకియవిల్లి (1469-1527) ఇలా అన్నాడు. మూర్ఖులకు అధికారం వస్తే దాంతో వారి ఆత్మవిశ్వాసం ఎంత పెరుగుతుందంటే వారు మేధావులు సృష్టించిన, నిర్మించిన అన్ని వ్యవస్థలను విచక్షణ లేకుండా నాశనం చేస్తారు. ఎందుకంటే మూర్ఖులకు మూర్ఖత్వం తలకు ఎంత ఎక్కుతుందంటే, ప్రజల క్షేమం, సౌఖ్యం గురించి కూడా మర్చిపోతారు. తొలి ప్రధాని నెహ్రూ మీద ప్రస్తుత ప్రధాని మోదీ విమర్శలు, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయాలన్న రేవంత్‌రెడ్డి ఆరాటం చూస్తుంటే ఒక విషయం అర్థమవుతున్నది. ప్రస్తుత పాలకులు తమ చేతగానితనాన్ని దాచుకుని, విజయవంతం అయిన మేధావులను బద్నాం చేయాలనే యత్నం, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న శృతిమించిన విశ్వాసం కలిగి ఉండటాన్ని గమనించవచ్చు. కానీ చరిత్రను చెప్పిన సత్యం ఏంటంటే.. ‘ఎదుటివాళ్లపై చెడ్డవాళ్లు అనే ముద్రవేసి, తాము గొప్పవాళ్లమని నిరూపించుకునేందుకు జరిగిన ప్రయత్నాలేవీ, ఎప్పుడూ సఫలం కాలేదు.. కావు.’
Stupid people are not aware of their stupidity; lacking the potential to understand complex issues related to that topic, they try to simplify it in their own way అంటే తెలివి తక్కువ వాళ్లకు, మూర్ఖులకు తాము అటువంటి వారమని తెలియదు.
– కనకదుర్గ దంటు