ఇంఫాల్/గువాహటి, జనవరి 31: సురక్షితంగా, సకాలంలో పునరావాసం కల్పించాలని, రాష్ట్ర సరిహద్దు సమగ్రతను కాపాడాలని కోరుతూ వివిధ మతాలు, వివిధ తెగలకు చెందిన అంతర్గత నిరాశ్రయులు సహా వందలాది మంది పౌరులు శనివారం మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహాయ శిబిరాల నుంచి తరలివచ్చిన నిరాశ్రయులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
2023 మేలో మణిపూర్‌లోని మైతీ, కుకీ తెగల మధ్య ప్రారంభమైన హింసాత్మక ఘర్షణల్లో వందలాది మంది మరణించగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. సుదీర్ఘకాలంగా తాము అనుభవిస్తున్న కష్టాలను వెల్లడించడానికి, తామంతా ఒక్కటేనన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియచేసేందుకు వందలాది మంది నిరాశ్రయులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు.