యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 11 : కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టేందుకు బీసీలు సిద్ధం కావాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. మండలంలోని చొల్లేరు గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో విలేకరులతో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇప్పించారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీ కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు.
కానీ కులగణన తప్పుల తడక ఉందని, దామాషా ప్రకారం పొంతన లేకుండా కుంటి సాకులు చెప్పి ఒక్కరోజు అసెంబ్లీ తీర్మానం పేరుతో బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. తప్పుల తడకగా ఉన్న కులగణన పత్రాలను చదివి నామమాత్రంగానే ముగించారన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొంది రాజ్యాంగ సవరణ జరుగాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42 శాతం సీట్లను ఇస్తామంటూ మరో మోసానికి తెర లేపారని మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
బీసీ పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పని చేస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అంతకుముందు చొల్లేరు గ్రామానికి చెందిన దివంగత నేత, బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ కొక్కలకొండ యాదగిరి కుమారుడు కొక్కల కొండ మల్లేశ్ గుండెపోటుతో మరణించగా, ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, బీఆర్ఎస్ నాయకుడు ర్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.