హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడికతీతను ఆర్భాటంగా చేపట్టిన ప్రభుత్వం… ఏడాది గడవకముందే అటకెక్కించిందని తెలుస్తున్నది. పలుచోట్ల పూడికతీత పనులు ప్రారంభమేకాకపోగా, చేపట్టిన చోట అడుగు ముందుకుపడని దుస్థితి నెలకొన్నది. ఉదాహరణకు ఎల్ఎండీలో 33 లక్షల టన్నుల పూడికను తొలగిస్తామని చెప్పిన సర్కారు.. ఏడాదిలో 16 టన్నుల లక్ష్యం కూడా చేరుకోలేదు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం చెప్తున్న డ్రెడ్జింగ్ విధానమే సరికాదని నీటిపారుదలరంగ నిఫుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫలితాలు రావడం లేదని చెప్తున్నారు.
జలాశయాలు, ప్రాజెక్టుల్లోని పూడికతీతకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘానికి ఇరిగేషన్‌శాఖ నివేదిక సమర్పించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్లో ప్రత్యేకంగా పాలసీలు అమలు చేస్తున్నారని తెలిపింది. రాజస్థాన్‌లో పరిశీలించిన వివరాలను అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల్లోనూ అధ్యయనం చేయాల్సి ఉన్నదని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం కమిటీ చెప్పిన విషయాలను పట్టించుకోలేదు. పాలసీల గురించి తెలుసుకోకుండా, సొంతంగా పాలసీ రూపొందించకుండా పూడికతీతను ఆర్భాటంగా చేపట్టింది.
ప్రాజెక్టుల్లో పూడికను డ్రెడ్జింగ్ విధానంలో తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం పూడికను అధునాతన యంత్రాలతో తవ్వి తీసి, అందులోని మెటీరియల్‌ను దేనికదిగా వేరు చేస్తారు. రాజస్థాన్‌తోపాటు పలు రాష్ర్టాల్లో డ్రెడ్జింగ్ విధానాన్ని చిన్ననీటిపారుదల జలాశయాలకు మాత్రమే పరిమితం చేశారు. అక్కడ ప్రాజెక్టుల్లో ఎక్కువశాతం ఇసుకనే పేరుకుపోయింది. తెలంగాణ ప్రభుత్వం డ్రెడ్జింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని కాంగ్రెస్ కీలక నాయకుడి పైరవీతో ఆ పనులను.. రాజస్థాన్‌లో పూడికతీత పనులు నిర్వహించిన ఏజెన్సీకే రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. తెలంగాణ ప్రాజెక్టుల్లో ఇసుక మేటలు తక్కవ.. మట్టి, బురద ఎక్కువ. కాబట్టి డ్రెడ్జింగ్ విధానంతో ప్రయోజనమేమీ లేదని గతంలోనే నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వరంగల్ భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పరిస్థితి కూడా ఎటూ తేలడంలేదు. దాదాపు 18 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలని అధికారులు అంచనా వేశారు. తొలగించిన మట్టి నిల్వకు దాదాపు 100 ఎకరాల భూమి కేటాయించారు. సమీపంలో వ్యవసాయభూములు లేకపోవడంతో మట్టిని ప్రభుత్వమే తరలించేందుకు సిద్ధమైంది. రవాణా కోసం దాదాపు రూ.11.16 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది.
నిరుడు మార్చిలో ఇరిగేషన్‌శాఖ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో పనులను ప్రారంభించింది. కానీ నిర్దేశిత లక్ష్యంలో అది 30 శాతం మాత్రమే పూర్తి చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత పనులు అటకెక్కాయి. తొలగించిన పూడికను రవాణా చేసే పనులను దక్కించుకున్న గుత్తేదారు చేతులు ఎత్తేసి, ప్రీక్లోజర్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ముందస్తు కసరత్తు చేయకుండా హడావుడిగా చేపట్టిన పూడికతీత పనులు అటకెక్కినట్టేనని నీటిపారుదలశాఖలో చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వం కడెం, లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యామ్‌లను పూడికతీతకు పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. కడెం ప్రాజెక్టులో 3.28 కోట్ల టన్నులు, మిడ్ మానేరులో 62 లక్షల టన్నులు, లోయర్ మానేరు డ్యామ్‌లో 33 లక్షల టన్నుల పూడికను వెలికి తీయాలని లక్ష్యం పెట్టుకున్నది. పూడిక నుంచి ఇసుకను వేరు చేసి, క్యూబిక్ మీటర్ పరిమాణాన్ని రూ.336.39కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో రాష్ర్టానికి రూ.1439.55 కోట్ల ఆదా యం సమకూరుతుందని అంచనా వేసింది. 3 డ్యామ్‌ల్లో పనులను 20 ఏండ్ల కాలపరిమితితో గుజరాత్‌కు చెంది న ఒకే కంపెనీకి కట్టబెట్టింది. ఏడాది పూర్తికావొస్తున్నా సదరు ఏజెన్సీ పూర్తిస్థాయిలో పనులను మొదలుపెట్టలేదు.