యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో ఉన్న భూములను ఖతం పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. జిల్లాలపై డేగ కన్నువేసింది. యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచించింది. పెద్ద మొత్తంలో రెవెన్యూ రాబట్టేందుకు స్కెచ్ గీసింది. మాజీ సీఎం కేసీఆర్ రూ.1,200 కోట్లతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్నది. ఈ క్రమంలో ఈ జిల్లాలోని ప్రభుత్వ భూములు విక్రయించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ పనిని హెచ్ఎండీకు అప్పగించింది.
ఇందుకోసం ట్రిపుల్ ఆర్ లోపల ఉన్న ఆరు మండలాలను గుర్తించింది. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములు విక్రయించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ఆయా మండలాల్లోని సర్కార్ భూముల టైటిల్, క్యాటగిరీ, విస్తీర్ణం, ప్రస్తుత పరిస్థితి వివరాలు ఇవ్వాలని జిల్లా అధికారులకు లేఖ రాసింది. ఈ నెల 6న అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వెంకారెడ్డి.. భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలతోపాటు ఆరు మండలాల తహసీల్దార్లకు లేఖ రాశారు. దీన్ని అత్యంత అవసరమైన అంశంగా పరిగణించాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఆయా మండలాల్లో మంచి డిమాండ్ ఉన్న గ్రామాలను తహసీల్దార్లు గుర్తించారు. ఒక్కో గ్రామంలో 150 నుంచి 200 ఎకరాలు ఉండేలా కసరత్తు చేశారు.
భువనగిరి మండలం రాయగిరి పరిధిలో సర్వే నంబర్ 742, 56, 57, 58, 86, 24, 25, 26లో 300 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇక్కడ ఎకరం 3 రూ.కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు డిమాండ్ ఉంటుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 175 ఎకరాలను గుర్తించారు. ఇందులో 125 ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా, మిగతావి రైతుల పట్టా భూములు అని అక్కడి వారు చెప్తున్నారు. బీబీనగర్ మండలం రహీంఖాన్ గ్రామంలో 71 ఎకరాలతో ప్రతిపాదనలు సమర్పించారు.
భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్లోని 160 సర్వే నంబర్లో 117 ఎకరాలు, మెహర్నగర్లోని 50 ఎకరాలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆరు మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములను గుర్తించనున్నట్టు తెలిసింది. సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురంలో ప్రభుత్వ భూమితోపాటు దాని చుట్టూ ఉన్న రైతుల భూములను సైతం గుర్తించినట్టు తెలుస్తున్నది. దీంతో అక్కడి రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు తీసుకోవద్దని స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.