చిక్కడపల్లి, సెప్టెంబర్ 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, అందులో భాగంగా ఎన్నికల కమిషన్‌ను భ్రష్టుపట్టించిందని పలువురు వక్తలు విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలని, ‘సర్’ ప్రక్రియను నిలిపి వేయాలని, ఓటరు జాబితాల నుంచి తొలగించిన అర్హులకు ఓటు హక్కు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ యావత్తు దేశాన్ని తప్పుదోవ పట్టించారని, ఈ అప్రజాస్వామిక చర్య వెనుక మోదీ సర్కార్ హస్తం ఉన్నదని ధ్వజమెత్తారు.
ఓటరు జాబితాల నుంచి అక్రమంగా కోట్ల మందిని తొలగించడంపై వామపక్షాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీజేఏఎస్, ప్రజాసంఘాలు, మేధావులతో కలిసి ఈ నెల 30న హైదరాబాద్‌లో సీఈవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజల్లో నానాటికీ నమ్మకం సన్నగిల్లుతున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఓ పార్టీకీ అనుకూలంగా ఈసీ వ్యవహరిచడమేంటని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.