జనగామ, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : అమెరికా వెళ్లాలి.. డాలర్లు సంపాదించాలనేది యువత కల. అది ఇప్పుడు క్రమంగా కరిగిపోతున్నది. యూఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్నటి వరకు అమెరికాలో కాలు పెడితే చాలనుకునే స్థితి నుంచి ఇప్పుడు అమ్మో అంటూ బెంబేలెత్తిపోయే దుస్థితికి చేరుకున్నారు. విద్యాభ్యాసం కోసం అప్పులు చేసి, బ్యాంకు రుణాలు తీసుకొని వెళ్లిన వారంతా అక్కడ ఉండలేక.. ఇండియాకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యతరగతికి చెందిన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాల కోసం సతమతమవుతుండగా.. ఇక్కడి నుంచి వారికి డబ్బులు పంపడం తలకుమించిన భారంగా మారుతున్నది. ఎమ్మెస్ పూర్తయ్యాక అక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేకపోవడంతో ఇండియాకు తిగిరి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగావకాశాలు లేక డాలర్ డ్రీమ్‌ను పక్కన పెట్టి తిరుగు ముఖం పడుతున్న ఉదంతాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులను ట్రంప్ ఇంటికి పంపించగా.. మిగిలిన వారు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 25 వేల నుంచి 30 వేల మంది విద్యార్ధులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లినట్లు తెలుస్తున్నది.
సన్నగిల్లుతున్న ఆశలు..
ఎఫ్ 1 వీసాతో వెళ్లిన వారిపై అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం కఠిన ఆంక్షలు విధించింది. మరోవైపు అక్కడి చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నది. గ్రీన్కార్ట్ హోల్డర్లపైనా కక్ష కడుతున్నది. ఈ పరిస్థితిలో శాశ్వత నివాసం అనే మనవాళ్ల ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. ఇకపై అమెరికాలో దీర్ఘకాలికంగా ఉండడం కష్టమనే అభిప్రాయం అందరిలోనూ బలపడుతున్నది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం వీసా, ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినంగా చేసేందుకు సిద్ధమవుతుండటంతో ఇండియాకు రావడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. పెళ్లిళ్లు, శుభ కార్యాలకు అమెరికా నుంచి రావాలనుకునే వారంతా భయపడుతున్నారు. పెళ్లిళ్లు నిశ్చయమైనా ఇక్కడికి వస్తే అమెరికాకు తిరిగి వెళ్లడం కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు.
చాలా మంది తమ రక్తసంబంధీకుల పెళ్లిళ్లకు సైతం రాలేకపోవడం ఇటీవల ఉమ్మడి జిల్లాలో తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నది. ఇక అమెరికా వెళ్లి ఇండియాకు రాలేక పెళ్లి వయసు దాటిపోతున్న యువతీ, యువకుల పరిస్థితి వర్ణనాతీతం. దీంతో చేసేది లేక అక్కడే ఎవరో ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి నిశ్చయం చేసుకుంటే అమ్మాయి, అబ్బాయి తరపు తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు మాత్రమే విజిటింగ్ వీసాపై వెళ్లి తంతును పూర్తి చేసి వస్తున్నారు. స్టడీ వీసాపై వెళ్లి ఉద్యోగం లేక సతమతమవుతున్న విద్యార్థులు డబుల్ ఎంఎస్, పీహెచ్డీ వంటి అదనపు కోర్సులు చేస్తూ అక్కడే కాలం గడుపుతున్నారు. అప్పటికే పలు కోర్సులు పూర్తి చేసి ఖాళీగా ఉన్న చాలా మంది భారతీయులు, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు అమెరికాను వదిలి శాశ్వతంగా ఇండియా వచ్చి ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితులు వారి డాలర్ డ్రీమ్స్‌ను దూరం చేస్తున్నాయి. తమ పిల్లల భవిష్యత్ తలకిందులవుతుండడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, బ్యాంక్ ఈఎంఐలు కట్టలేక కొందరు తల్లిదండ్రులు సతమతమవుతుండగా.. మరికొందరు తమ స్థిర, చరాస్తులు, బంగారు ఆభరణాలను అమ్ముకుంటున్నారు.
జంకుతున్న విద్యార్థులు
అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన వారంతా సోషల్ మీడి యా అకౌంట్లను నిర్వహించాలంటే జంకుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, థ్రెడ్ ఖాతాలపై అమెరికా సంస్థలు నిఘా పెట్టాయి. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారందరినీ అక్కడ్నుంచి బలవంతంగా వెనక్కి పంపుతున్నాయి. గతంలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన భారతీయ విద్యార్థులను గుర్తించిన అక్కడ ప్రభుత్వం దేశం విడిచి వెళ్లాలంటూ వా రి మెయిల్‌కు సందేశాలు పంపింది. పరిస్థితులు తలకిందులవుతుండడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు జాబ్ లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ మరోవైపు దొడ్డిదారిలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాని కి చిక్కితే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నారు. రూపా యి విలువ రోజురోజుకూ బలహీనపడడం, అమెరికాకు డాలర్ రూపంలో ఇక్కడి నుంచి డబ్బులు పంప డం తల్లిదండ్రులకు కష్టంగా మారింది.