కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కొంతమంది స్వార్థం కోసం ఉద్దేశపూర్వకంగా చెక్‌డ్యామ్‌లను కూల్చివేశారని, ఇది తన అనుభవంతో చెప్తున్నానని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన దర్యాప్తు చేయడంతోపాటు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం జాప్యం చేసినా అది మరిన్ని చెక్‌డ్యామ్‌లకు ముప్పు తెస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో కూలిపోని చెక్‌డ్యామ్‌లు ఇప్పుడు ఎలా కూలాయన్న కోణంలో ఆలోచిస్తే.. నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే రైతుల ప్రయోజనాలకు విఘాతం కలుగకుండా.. మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని స్పష్టంచేశారు.
ఇటీవల కూల్చివేసినట్టు భావిస్తున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్‌డ్యామ్, పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌ను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేంద్రసింగ్ ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..
ప్రశ్న: క్షేత్రస్థాయిలో చెక్‌డ్యామ్‌లను పరిశీలించిన తర్వాత ఏ నిర్ణయానికి వచ్చారు?
జవాబు: నిశితంగా పరిశీలిస్తే అవి ముమ్మాటికి కూల్చివేతలే. జిలెటెన్స్టిక్స్తో పేల్చివేసినట్టు కనిపిస్తున్నది. సాధారణంగా నీటి ప్రవాహం ఒత్తిడి ఎక్కువగా ఉన్నవైపు బరాజ్ కూలిపోతుంది. నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉన్న బరాజ్ కూలిపోయే అవకాశం లేదు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇక్కడ కూలిన బరాజ్‌లు ప్రకృతికి విరుద్ధంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో కూలిపోయాయి. క్షేత్రస్థాయిలో నిశితంగా చూస్తే పూర్తి వివరాలు అర్థం అవుతాయి.
ప్రశ్న: తనుగుల చెక్‌డ్యామ్ వద్ద మీరుగుర్తించిన ప్రధాన అంశం ఏంటి?
జవాబు: ఈ చెక్‌డ్యామ్‌ను పక్కాగా కూల్చివేశారు. నది మూలను చేరుకున్న సమయంలోనే ఈ విషయాన్ని నేను పసిగట్టాను. ఒక కార్నర్లో చెక్‌డ్యామ్‌కు డ్రిల్మిషన్తో రంధ్రం చేశారు. తర్వాత జిలెటెన్స్టిక్స్ను అందులో అమర్చి పేల్చివేశారు. దీనిపై నేను ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏమిటంటే.. వీలైనంత త్వరగా కూల్చివేసిన ఆ స్వార్థపరులను పట్టుకోండి. ప్రకృతి విధ్వంసానికి పాల్పడే వారిని, మానవ మనుగడకు ముప్పుగా మారుతున్న వారిని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం త్వరగా వారిని పట్టుకొని జైల్లో బంధించాలి.
ప్రశ్న: బ్లాస్టింగ్ వల్ల కాదు, నాణ్యత లోపంతో కూలిపోయిందని కొంతమంది చేస్తున్న విమర్శలపై మీ అభిప్రాయం?
జవాబు: నాణ్యత లేకపోతే నిర్మాణం జరుగుతున్న సమయంలోనే బరాజ్‌లు కూలిపోతాయి. ఉదాహరణకు తనుగుల చెక్‌డ్యామ్ రెండేండ్ల నుంచి నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడింది. నిర్మాణం జరిగి రెండేండ్లపాటు వరదలను తట్టుకొని నిలిచిన బరాజ్ ఆ తర్వాత కూలిపోతే.. నిర్మాణంలో లోపం ఉందని చెప్పడం కరెక్టు కాదు. పరిస్థితులను సునిశితంగా పరిశీలించి దీనిని నాసిరకం నిర్మాణంగా నేను భావించడం లేదు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు గానీ, బరాజ్‌లో నీరు నిండుగా ఉన్నప్పుడుగానీ, వర్షాలు ఉధృతంగా కురిసినప్పుడుగానీ బరాజ్ కూలిపోలేదు, కొట్టుకుపోలేదు. అలాంటిది నీరు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత నిలకడగా ఉన్న సమయంలో ఎలా కూలుతుంది? ఇది సహజంగా కూలిపోలేదు. దీన్ని కూల్చివేశారు.
ప్రశ్న: మీరు ప్రభుత్వానికి ఏమి సూచనలు చేస్తారు?
జవాబు: తెలంగాణ ప్రభుత్వానికి నేను ఇచ్చే మొదటి సలహా.. ఏ బరాజ్ అయితే కూల్చివేయబడిందో.. దాన్ని వెంటనే మరమ్మతు చేసి వినియోగంలోకి తేవాలి. తద్వారా నదికి రెండు వైపులా ఉన్న ప్రజలకు మేలు కలుగుతుంది. భూగర్భజలాల పెంపునకు దోహదపడుతుంది. నదికి ఇరువైపులా ఉన్న బావులన్నీ నీటి ఊటలతో జలకళను సంతరించుకుంటాయి. నదిప్రవాహం ఉన్నంత దూరం రైతులు, ప్రజలకు మేలు జరుగుతుంది. బరాజ్ కూలిపోవడం వల్ల నీరు వృథాగా పోతుంది. నదికి ఇరువైపుల ఉన్న రైతులు నష్టపపోతారు, భూములు తీవ్రంగా దెబ్బతింటాయి, బావులు ఎండిపోతాయి. ఈ నీటి వృథాను అడ్డుకోవాలంటే వెంటనే బరాజ్‌ను మరమ్మతు చేయాలి.
ప్రశ్న: మీకు జల సంరక్షణ విషయంలో దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఇటువంటి ఘటనలు ఎక్కడైనా చూశారా..?
జవాబు: నేను యాభై ఏండ్లుగా నీటికి సంబంధించిన పనులనే చేపడుతూ వస్తున్నాను. ఏనాడూ ఇలా చెక్‌డ్యామ్‌ను కూల్చిన ఘటనను చూడలేదు. దేశంలోని 23 నదులపై 15,800 చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో నదులను సజీవంగా ఉంచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాను. ఎక్కడా ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోలేదు. ఈ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేశారో నాకు అర్థం కావడం లేదు. కూల్చివేత వెనుక విలువైన ఇసుకను దోచుకోవడం తప్ప మరొక కారణం కనిపించడం లేదు.
ప్రశ్న: మీ అనుభవంలో చెక్ డ్యామ్‌ల ద్వారా కలిగే లాభాలు ఏంటి?
జవాబు: నదిపై నిర్మించే చిన్నచిన్న బరాజ్‌లు (చెక్ డ్యామ్‌లు) నదికి ఇరువైపులా రైతులకు, ప్రజలకు సాగు, తాగునీటి సౌకర్యాలను కల్పిస్తాయి. ఈ చిన్నచిన్న బరాజ్‌లు నదిని సజీవంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. గరిష్ఠంగా రెండున్నర మీటర్ల ఎత్తులో నిర్మించే ఈ చెక్‌డ్యాంలు నదీ పరీవాహక ప్రజల జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. నదిలో ఉండే ఇసుక నీటిని శుద్ధి చేస్తుంది. నదిలోని నీరు, ఇసుక పరీవాహక ప్రాంత ప్రజల ఆర్థిక, సాంస్కృతిక, ప్రకృతిపరమైన అంశాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. నది ఇసుక అత్యంత విలువైనది. దీనికోసం కొంతమంది స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. అందుకే బరాజ్‌లను కూల్చివేసి నీటిని నిల్వ ఉండకుండా చేస్తున్నారు. నీటి ప్రవాహం నిలిచిపోయిన తర్వాత అడుగున ఉండే ఇసుకను తవ్వి విక్రయించుకుంటున్నారు. ఈ ప్రక్రియలో నదిపై ఆధారపడి జీవించే రైతులు, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఇసుక కోసం మనిషి చూపిస్తున్న స్వార్థం అత్యంత విషాదకరమైంది. ఈ స్వార్థంతో మనిషి తన మనుగడ, సంస్కృతి, ప్రకృతి స్వచ్ఛత లాంటి అంశాలన్నింటినీ మరచిపోతున్నాడు.
ప్రశ్న: మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?
జవాబు: జల పరిరక్షణే ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో స్పందించాల్సిన అవసరం మాపై ఉంది. వీలైతే హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిస్తాం. అవసరం అనుకుంటే చట్టపరంగా కూడా ముందుకెళ్తాం. ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు నాకు సమాచారం లేదు. తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా మా చర్యలుంటాయి. నిపుణులతో మాట్లాడి కార్యాచరణ సిద్ధంచేసుకుంటాం.
చెక్‌డ్యామ్‌ను కూల్చివేయడం, పడగొట్టడం అనేది రైతులు చేసిన పని కాదు. రైతు ఎప్పుడూ ప్రకృతిని, మనిషి మనుగడను కాపాడుతూనే ఉంటాడు. రైతు ఎప్పుడైనా కష్టపడి సంపాదించి తింటాడే తప్ప, ఇతరులది గుంజుకోవాలనే స్వార్థాన్ని కలిగి ఉండడు. ఈ చెక్‌డ్యామ్‌లను స్వార్థపరులైన వ్యక్తులు పడగొట్టారు. ఆ స్వార్థపరులను ప్రభుత్వం గుర్తించాలి. వారిని అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపించాలి. తన స్వార్థంతో ప్రకృతిని ధ్వంసం చేసే హక్కు ఏ వ్యక్తికీ లేదు. అలాంటి వారి కోసమే పోలీసు, న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. తప్పు చేసే వారిని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
ప్రశ్న: చెక్‌డ్యామ్‌ల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
జవాబు: నిజానికి ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడో స్పందించాలి. గతంలోనూ ఒక చెక్‌డ్యామ్ పేల్చివేతకు కుట్రలు చేస్తే.. వారిపై స్వయంగా రైతులే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. ఈ బరాజ్‌లను పరిశీలిస్తే ఇసుక కోసం కూల్చివేశారని స్పష్టమవుతున్నది. ఇసుక మాఫియా ఈ బరాజ్‌ను కావాలనే కూల్చివేసిందన్నది సుస్పష్టం. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన దర్యాప్తు చేయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని నేను విజ్ఞప్తిచేస్తున్నా. ఏమాత్రం ఆలస్యం జరిగినా. మరిన్ని చెక్‌డ్యామ్‌లకు ముప్పు వాటిల్లుతుంది.
చెక్‌డ్యామ్‌ల పేల్చివేతపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్.. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ డిమాండ్
పెద్దపల్లి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)/ మంథని/ మంథని రూరల్/ జమ్మికుంట: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌ల పేల్చివేతలు, కూల్చివేతలపై ‘పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్’ను ఏర్పాటుచేస్తామని మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వంతోపాటు రైతులు, ప్రజలదేనని అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్‌డ్యాం, పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాంను సందర్శించారు. ఆయన వెంట నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్, ప్రజా నిఘా వేదిక అధ్యక్షుడు వీవీ రావు, మానేరు రివర్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, జర్నలిస్టు సలీంతో కలిసి చెక్‌డ్యామ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల రాజేంద్రసింగ్ మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో నీరు వృథాగా వెళ్లకుండా ప్రజలకు సమృద్ధిగా ఉపయోగపడేలా అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారని చెప్పారు. ప్రజల ప్రయోజనం కోసం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని సంరక్షించాలని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నదని తెలిపారు. డిసెంబర్ నెలలో ఇరిగేషన్ ప్రాజెక్టులైనా.. చెక్డ్యామ్లైనా కూలే అవకాశముండదని చెప్పారు. ఒకవేళ కూలినా శిథిలాలు దిగువకే వెళ్తాయని తెలిపారు.
తనుగుల, అడవిసోమన్‌పల్లి చెక్డ్యామ్లది కూల్చివేతనే అని స్పష్టంచేశారు. ఈ రెండు చోట్ల టన్నులకొద్దీ శిథిలాలు వెనక్కిపడి ఉన్నాయని తెలిపారు. చెక్‌డ్యామ్‌ల ధ్వంసంపై పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి దర్యాప్తు జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసంపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.