కొండాపూర్, డిసెంబర్ 22 : కొత్త సంవత్సరం వేడుకలే లక్ష్యంగా ఐటీ కారిడార్‌లో డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులతోపాటు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడకు చెందిన అలీం ఎండీఎంఏ సప్లయిర్‌గా ఉండగా, కృష్ణ జిల్లా ఎలమలూరు గ్రామానికి చెందిన వంశీ దిలీప్(29), చీరాల రామకృష్ణాపురం గ్రామానికి చెందిన బాల ప్రకాశ్బాలు(29) ఇద్దరూ డ్రగ్ పెడ్లర్లు ట్రాన్స్‌పోర్టు చేస్తున్నారు. ఇద్దరూ కలిసి బెంగుళూరుకు వెళ్లి ఓ నైజీరియన్ వద్ద ఎండీఎంఏ, ఓజీకుష్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వచ్చారు.
కొండాపూర్ అంజయ్యనగర్‌లోని పీజీ హాస్టల్లో డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు సోమవారం తెల్లవారుజామున హాస్టల్‌పై రైడ్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న వంశీ, బాల ప్రకాశ్బాలుతోపాటు, డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మణికంఠ మణితేజ(30), ఐటీ ఉద్యోగి రోహిత్ గౌడ్(26), బిజినెస్ మ్యాన్ తరుణ్(33)లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 1.50 లక్షల విలువైన ఎండీఎంఏ, ఓజీకుష్, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అలీం, ఓజీ కుష్ సైప్లె చేసిన కార్తీక్, బెంగుళూరులో ఎండీఎంఏ అమ్మిన నైజీరియన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.