హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏడున్నరేండ్లుగా నినాదాలకే పరిమితం అవుతున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’, ‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి నినాదాలు ఇస్తున్నారే తప్ప వాటిని ఆచరణలోకి తెచ్చేలా బలమైన విధానాలు, నిర్ణయాలు, సంస్కరణలు అమలుచేయడం లేదని అన్నారు. కనీసం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కూడా అమలుచేయకుండా తెలంగాణ, ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.
ఇటలీకి చెందిన ప్రముఖ ‘ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్’ల తయారీ సంస్థ ‘డ్రిల్మెక్-ఎస్పీఏ’ హైదరాబాద్‌లో తమ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఈ యూనిట్‌కు హైదరాబాదీ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డ్రిల్మెక్-ఎస్పీఏ సీఈవో సిమోనే ట్రెవిసాని ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ ఏడున్నరేండ్లుగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు.
పరిశ్రమలను ఆకర్షించడంలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. అయినా రాష్ర్టానికి కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామీకరణను మరింత ప్రోత్సహించేందుకు ‘ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాలు’ (స్పెషల్ ఇండస్ట్రియల్ సెంటర్లు) ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏడున్నరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమలు చేయలేదని, తెలంగాణకు, ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ వంటి స్లోగన్లు ఇస్తే సరిపోదని, వాటిని అమలు చేసేలా బలమైన విధానాలు, సంస్కరణలు ప్రవేశపెట్టి, మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని కేంద్రానికి సూచించారు. ‘కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా.. మేం నిలబడుతున్నాం. అభివృద్ధి వైపు వెళ్తున్నాం. మా హక్కుల కోసం కొట్లాడుతాం’ అని కేటీఆర్ చెప్పారు.
ఎన్నిసార్లు కోరినా మొండిచెయ్యే
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటికి ఏడు బడ్జెట్లు వచ్చాయన్న కేటీఆర్.. ఈ ఏడేండ్లుగా బడ్జెట్ సమయంలో రాష్ర్టానికి మేలు చేస్తారని ఎంతో ఎదురుచూశామని, అయినా కేంద్రం మొండిచెయ్యి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన హామీ ప్రకారం రాష్ర్టానికి ఆరు ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అయినా కేంద్రం వేరే రాష్ర్టాల్లో ఏర్పాటు చేసిందే తప్ప, తెలంగాణకు మంజూరు చేయలేదని మండిపడ్డారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరుతో దేశంలోనే అతిపెద్ద పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఆసియాలోనే అతి పెద్ద ఫార్మాసిటీని హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నామని చెప్పారు.
ఈ రెండు భారీ క్లస్టర్లు పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించనున్నాయని తెలిపారు. వీటి ఏర్పాటుకు సహకరించడం ద్వారా కేంద్రం ప్రోత్సహిస్తుందని భావించామని, కానీ సహకరించడం లేదని చెప్పారు. అయినా తెలంగాణ అభివృద్ధి ఎక్కడా ఆగలేదని, ఆగబోదని కేటీఆర్ స్పష్టంచేశారు. కేవలం రాజకీయ కారణాల వల్ల కేంద్రం తెలంగాణను విస్మరిస్తే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదన్నారు. ఇలాగే కొనసాగితే మేకిన్ ఇండియా, అత్మనిర్భర్ భారత్ వంటివాటికి అర్థం లేకుండా పోతుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తమ హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తెలంగాణ, ఏపీ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.