రాష్ర్టాలపై కేంద్రం బోడిపెత్తనం ఏంటని, రాష్ర్టాల సమాహారమే కేంద్ర ప్రభుత్వమనిమరువొవద్దని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రానికి ప్రత్యేక అధికారాలు ఏవీ లేవన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ పెత్తనం చెలాయిస్తుందన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యేలు ్ర్ర్టరి, బీరం, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య హాజర య్యారు. అనంతరం వనపర్తిలో సభా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. 8న వనపర్తిలో జరిగే సీఎం బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నాగర్‌కర్నూల్, మార్చి 4 : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీతో రాష్ర్టాల ఆదాయాన్ని కొల్లగొడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ర్టాలపై కేంద్రం బోడిపెత్తనమేంటని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో అంబలి కేంద్రాల్లో ఆకలి తీర్చుకున్నామని.., ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చామని.. ఇదంతా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని తెలిపారు. సాగునీరు పుష్కలంగా అందుతుండడంతో పాలమూరు సస్యశ్యామలంగా మారిందని, రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్హాల్లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధితో కడుపు నింపుతున్న సీఎం కేసీఆర్‌కు ఏం చేసినా రుణం తీర్చుకోలేమన్నారు. ఇక్కడి అభివృద్ధిని ప్రపంచ దేశాలు వెలుగెత్తి చూపుతున్నాయని.., అందుకే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని చెప్పారు. భారత రాజకీయాలు నేతలను తయారు చేశాయే కానీ.. మార్గదర్శులను తయారు చేయలేకపోయాయన్నారు. వేల టీఎంసీల నీళ్లున్నా, కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నా.. రాష్ర్టాలు ఆకలితో అలమటిస్తున్నాయన్నారు. కానీ, తెలంగాణాలో అలాంటి పరిస్థితులు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తూ పెత్తనం చెలాయిస్తుందన్నారు. ఎమ్మెల్యే కాకుండానే మోడీ ముఖ్యమంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. ఆ తర్వాత విభజన రాజకీయాలు మొదలుపెట్టి ప్రధాని అయ్యారన్నారు. కిందిస్థాయి నుంచి ఎదిగిన కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లేందుకు ఎందుకు అర్హుడు కాదో చెప్పాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన పోరాటయోధుడికి దేశ రాజకీయాలు కొత్తేమీ కాదన్నారు. దేశాన్ని పాలిస్తున్న మోడీ ఏం చదివాడన్నది ప్రశ్నార్థకంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా పది వేల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు చేపట్టలేదన్నారు. ఈ దేశం, భవిష్యత్ తరాలు బాగుపడాలన్న లక్ష్యంతో కేసీఆర్ బయలుదేరారన్నారు. మనం చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయన్నారు. ప్రజల ఆకలి, ఆర్తిని అర్థం చేసుకునే స్థితిలో ఇతర పార్టీలు లేవన్నారు. ఈనెల 8వ తేదీన వనపర్తి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ నిర్వహించే బహిరంగ సభకు నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి పాలమూరు ఐకమత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొల్లాపూర్, మార్చి 4 : జాతీయ పార్టీలు.. గాలి వస్తే కొట్టుకుపోతాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని.., దేశంలో ఈ కొవకు చెందిన పార్టీలు రెండు, మూడు ఉన్నాయన్నారు. గాలికి ఎదురొడ్డి నిలబడే శక్తి టీఆర్ఎస్కు ఉందని పేర్కొన్నారు. వనపర్తిలో సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తలతో ఎస్ఎం గార్డెన్లో పట్టణ పార్టీ అధ్యక్షుడు పరశురాంగౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో వందేండ్లయినా విపక్షాలు అధికారంలోకి రాలేవని.., వీరి గోలను చూస్తే ఇనుపడబ్బాలో రాళ్లు వేసి పిట్టలను లేపటోళ్లలాగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, బీజేపీ ఎంపీ, ఆర్థికవేత్త సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు సీఎం కేసీఆర్ పాలనను ప్రశంసిస్తుంటే.. ఏమీ తెలియని దద్దమ్మలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కిష్టాపూర్ వద్ద రామన్నగట్టు రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, అది మంజూరైతే పాన్‌గల్ మండలంలోని 10 వేల ఎకరాల రైతులకు సాగునీటి సమస్య తీరనున్నదన్నారు. సింగవట్నం శ్రీవారిసముద్రం నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ను కృష్ణానీటితో నింపేందుకు రూ.147 కోట్లు మంజూరయ్యాయన్నారు. అయితే, ఈ కెనాల్ అలాట్మెంట్లో కొన్ని మార్పుల కారణంగా ఆలస్యమైందని, త్వరలోనే సరిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే జూరాల డ్యాం ఎత్తు పెంచుతామని మీటింగ్‌లు పెట్టి చెబుతున్నారని.., వారికి మేము ఆ అవకాశాం ఇవ్వమని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ బహిరంగసభకు భారీగా తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వనపర్తి నుంచే శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఒకాయన అబద్దాల ఫ్యాక్టరీ పెట్టారని.., అలాంటి వారు ప్రజలను ఎంతకాలం మభ్యపెడుతారని విమర్శించారు. కొందరు వాట్సాప్లకే పరిమితమై దుష్ప్రచారాలతో పబ్బం గడుతున్నారని దుయ్యబట్టారు. బీడు భూములకు నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ముందుగా పార్టీ నాయకులు మంత్రి, ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్‌విండో చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : మెట్టుపల్లికి సాగునీరు తీసుకొస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మెట్టుపల్లి వార్డు ప్రజలు శుక్రవారం మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ ప్రాంతానికి సాగునీరు అందించాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానాకాలం నాటికి సాగునీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత వార్డులో పర్యటిస్తానని చెప్పారు. ప్రత్యేకంగా పైపులైన్ ఏర్పాటుచేసి సాగునీరు ఇస్తామన్నారు. మెట్టుపల్లి మీదుగా కలెక్టరేట్ నుంచి రాజనగరానికి బైపాస్ రహదారిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పొలాల్లో ఒండ్రుమట్టి వేసుకోవాలన్నారు. ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మెడికల్ కళాశాల వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషాతో కలిసి పరిశీలించారు.