నల్లగొండ, మార్చి 23 : తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ తరహాలో సేకరించాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన మహాజన సభలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏకగ్రీవంగా మూడు తీర్మానాలు చేశారు. పంజాబ్ తరహాలో తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే సేకరించాలని కోరు తూ ప్రధాని నరేంద్ర మోదీకి టెలిగ్రాం ద్వారా పంపించే తీర్మానాన్ని వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి ప్రవేశపెట్టగా డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. సహకార సంఘాల చైర్మన్ల గౌరవ వేతనాన్ని పెంచడంతోపాటు ప్రొటోకాల్ అమలును ప్రభుత్వం నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావుకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని మురళి ప్రవేశపెట్టగా డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్ బలపరిచారు. బ్యాంకులో పేరుకుపోయిన దీర్ఘకాలిక పెండింగ్ బకాయి రుణాలను 50 శాతం మాఫీతో వన్‌టైం సెటిల్మెంట్ చేసుకునే తీర్మానాన్ని డైరెక్టర్ అంజయ్య ప్రవేశపెట్టగా మరో డైరెక్టర్ సైదయ్య బలపరిచారు. ఈ సందర్భంగా చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నెలాఖరుకు అన్ని పీఏసీఎస్‌ల సమావేశాలను నిర్వహించి రైతులు పండించిన ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేసి ప్రధాని నరేంద్ర మోదీకి పంపించాలని పిలుపునిచ్చారు. బ్యాంకు అభివృద్ధికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బ్యాంకు ఎదుట సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సీఈఓ మదన్మోహన్, డీసీఓ ప్రసాద్, డైరెక్టర్లు అందెల లింగంయాదవ్, పాశం సంపత్‌రెడ్డి, సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.