మహబూబ్నగర్ : కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా, మద్దతు ధర కల్పించకుండా ఇబ్బందులు పెడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
గురువారం మహబూబ్నగర్ గ్రేన్స్ & సీడ్స్ మార్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత అన్నదాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, సకాలంలో, విత్తనాలు, ఎరువుల ను రైతులకు అందుబాటులో ఉంచడంతో వ్యవసాయం లాభసాటిగా మారిందని మంత్రి తెలిపారు.
అనుకూల పరిస్థితుల కారణంగా రైతులు మంచి పంటలను సాగు చేసి అధిక దిగుబడులను సాధిస్తున్నామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న FCI వెంటనే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
రైతులను ఏడిపించిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్న తీరు వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడిప్పుడే పచ్చగా మారుతోందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడు పంటలు పండుతాయన్నారు.
మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కు వచ్చే రైతులకు భోజన సదుపాయం కల్పించాలని చేసిన విజ్ఞప్తి మేరకు మహబూబ్ నగర్ గ్రేన్స్ & సీడ్స్ మార్చంట్స్ అసోసియేషన్ ముందుకు వచ్చి భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని మంత్రి అభినందించారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్, మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ సిబ్బంది, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.