రంగారెడ్డి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గత వారం రోజులుగా హోరెత్తించిన ప్రచారానికి తెరపడింది. దీంతో మైకులు మూగబోయాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 120 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గత వారం రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించా రు. సోమవారం సాయంత్రంతో క్యాంపెయిన్ గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాగా, అధికార కాంగ్రెస్‌పార్టీకి రెబెల్స్ బెడద ఓ వైపు ఉండగా.. అభ్యర్థులకు లీడర్లు సహకరించకపోవడంతో ప్రచారంలో వెనుకంజలో ఉన్నది. బీజేపీ నామమాత్రంగానే బరిలో ఉన్నది. బీజేపీ ప్రభావం ఆమనగల్లు మున్సిపాలిటీలో మాత్రమే ఉన్నది.
డబ్బు, మద్యం పంపిణీ..
జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మద్యం, డబ్బులపైనే ఆశలు పెట్టుకున్నది. ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలు, మున్సిపాలిటీలకు ఇన్చార్జీలను నియమించి వారి ద్వారా పంపకాలు జరిపేందుకు రంగం సిద్ధం చేశారు. ఎలాగైనా మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఓటర్లను కొనడమే మార్గమని భావిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. వారి ఆధ్వర్యంలోనే ఓటర్లకు కావల్సినవి సమకూర్చే పనిలో ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ కేంద్రాల్లో మ కాం వేసిన ఇన్చార్జీలు, ముఖ్య నేతలు ప్రచారం ముగియడంతో మున్సిపాలిటీలను విడిచి వెళ్లాల్సి ఉన్నా ఇంకా వెళ్లడంలేదు.
చివరిరోజు హోరెత్తింది..
మున్సిపల్ ఎన్నికల్లో సోమవారం 5 గంటలకు ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీలు చివరిరోజు ప్రచారాన్ని హోరెత్తించాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైకుర్యాలీలు నిర్వహించారు. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి కూడా ఇంటింటికీ తిరిగి బీఆర్ ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అలాగే, ఇతర కాంగ్రెస్, బీజేపీలు కూడా బైకుర్యాలీలు నిర్వహించాయి.