ఆలేరు, మార్చి 6 : యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు డివైడర్ పనులు చేస్తున్న కూలీలపై బస్సు దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా ఆస్పత్రిలో మరొ ఇద్దరు మృతిచెందారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వరంగల్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆలేరులో రోడ్డుపై ఎల్అండ్టీ డివైడర్ పనులు చేస్తున్న నలుగురు కూలీలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరికి చెందిన అంకర్ల లక్ష్మి(37), ఊరెళ్ల శ్యామ్(30) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరిని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఊరెళ్ల లావణ(34), అంకర్ల కవిత(38) మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దాంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను మరోవైపు దారి మళ్లించారు.
ఆలేరులో రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణం అడిగి తెలుసుకొని మృతుల కుటుంబాలను పరామర్శించి రోదిస్తున్న వారి ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతిచెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పరంగా మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున గ్రామస్తులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.