మందమర్రి, ఫిబ్రవరి 22: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని బీజేపీ మాజీ నాయకుడు మద్ది శంకర్ మండిపడ్డారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత మంగళవారం మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దేశ సంపదను, వనరులను కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని, దీంతో కార్మికులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తొలగించే హక్కు పరిశ్రమలకు చేకూరుతుందని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో సీఎం కేసీఆర్ జనరంజక పాలన చేస్తున్నారన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక, కేంద్ర వ్యతిరేక విధానాలు నచ్చక బీజేపీకి రాజీనామా చేసినట్టు ఆయన స్పష్టంచేశారు.