రవీంద్రభారతి, జూలై 10: దేశవ్యాప్తం గా ప్రతి కులానికీ ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ను కేటాయించి, తదనుగుణంగా జనగణన నిర్వహించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ కులగణన కూడా 2011 తరహాలో ప్రయోజనం లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. శుక్రవారం బషీర్బాగ్లో ని దేశోద్ధారక భవన్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్గౌడ్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజలు ఏ పేరుతో తమ కులాన్ని చెబితే అదే నమోదు చేయడం వల్ల ఒకే కులం వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో నమోదై డూప్లికేషన్, మల్టిప్లికేషన్ ఏర్పడి కులగణన విశ్వసనీయత దెబ్బతింటుందని పేర్కొన్నారు. యూనిక్ కోడ్లు లేక 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన వల్ల దేశవ్యాప్తంగా 42 లక్షల కులాల పేర్లు నమోదయ్యాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆలిండియా బీఎస్పీ కన్వీనర్, మాజీ డీజీపీ పూర్ణచందర్రావు, దుర్గయ్యగౌడ్, అయిలి వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.