వాషింగ్టన్, జూలై 10 : పసిఫిక్ మహాసముద్రంలో వ్యాపించిన ఎల్ నినో మరింత బలపడుతున్నదని, గత 75 ఏండ్లలో ఇది అత్యంత బలమైనదని అమెరికాకు చెందిన వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయని, ఈ ధోరణి పసిఫిక్‌లోని భూమధ్యరేఖకు మధ్య, తూర్పు వైపు విస్తరిస్తున్నదని పేర్కొంది. ఇది మరింత బలపడే అవకాశం 81శాతం ఉన్నదని, దీంతో 1950 తరువాత అనేక చారిత్రక రికార్డులు నమోదు కావచ్చని అంచనా వేసింది. తూర్పు పసిఫిక్‌లోని భాగాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2.7 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని తెలిపింది. ఎల్ నినో ప్రభావం వచ్చే ఏడాది వసంత కాలం ప్రారంభం వరకు కొనసాగవచ్చని వివరించింది.
ఎల్ నినో ప్రభావంతో అట్లాంటిక్, పసిఫిక్ ప్రాంతంలో వరదలు, కరువు, తీవ్రమైన శీతల పరిస్థితులు నెలకొనవచ్చని, ఇది తుఫాను, పెను తుఫాన్లను ప్రభావితం చేయగలదని తెలిపింది. భారత్‌లో: భారత్‌లో ఎల్ నినో ప్రభావంతో రిజర్వాయర్లు వట్టిపోతున్నాయి. దీంతో విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీపై తీవ్ర ప్రభావం పడుతున్నది. జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి 21 శాతం పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆనకట్టల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 7 శాతం తగ్గినట్టు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ లోటును బొగ్గు, అణు, పునర్వినియోగ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా భర్తీచేసినట్టు పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో సమీప భవిష్యత్తులో వాతావరణం సాధారణ స్థితికి చేరుకొనే అవకాశాలు మూడు శాతం మాత్రమే ఉన్నాయని, సముద్ర వాతావరణాన్ని చల్లబరిచే లా నినా ఏర్పడే అవకాశాలు ఎంతమాత్రం లేవని అమెరికా వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది.