హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ‘ఇటేటు రా అంటే.. ఇళ్లంతా నాదే అన్నట్టు’ ఆద్యకళ మ్యూజియం నిర్వాహకుల తీరు ఉన్నది. రూ.5 కోట్ల గ్రాంట్ కోసం మ్యూజియం నిర్వాహకులు ఏకంగా యూనివర్సిటీ భవనాన్నే కబ్జాచేసే కుట్ర జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆద్యకళ మ్యూజియం వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలున్నాయని తెలుగు వర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో 5 గదుల్లో ఇప్పటికే ఆద్యకళ మ్యూజి యం నడుస్తున్నది. వాస్తవానికి ఈ ఐదు గదులను మ్యూజియానికి కబ్జాబెడితే, ఇప్పుడేమో ప్రాంగణం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైఅంతస్తు వర్సిటీకి తీసుకొని, కింద అంతస్తు మ్యూజియానికి ఇవ్వాలని వారు అంటున్నారు.
రెండో అంతస్తు ఇప్పుడు కూలిపోయే దశలో ఉన్నది. ఇప్పటికీ ఈ భవనాన్ని వర్సిటీ వాడటమే లేదు. ‘కూలిపోయినది మాకు.. మంచిగున్నది ప్రైవేట్కా? ఇదేం పద్ధతి’ అంటూ విద్యార్థులు, అధ్యాపకులు మండిపడుతున్నారు. ‘ఆదివాసీల పేరిట.. ఆదాయ వనరుల వేట’ దాగి ఉన్నదని విద్యార్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. రూ.5 కోట్ల తతంగాన్ని అర్థం చేసుకొని, నాంపల్లిలోని తెలుగు వర్సిటీ ప్రాంగణాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రైవేట్ వ్యక్తులకు ప్రాంగణాన్ని అప్పగించే విషయమై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి తెలుగు వర్సిటీని కాపాడుకొనేందుకు విద్యార్థులు చేపట్టిన నిరసనలు శనివారం నాటికి పదోరోజుకు చేరుకొన్నాయి. ‘సేవ్ క్యాంపస్’ అంటూ విద్యార్థుల నినాదాలతో వర్సిటీ ప్రాంగణం మార్మోగింది. విద్యార్థుల పోరాటానికి సీనియర్ అధ్యాపకురాలు షేక్ హసీనా సంఘీభావం తెలిపారు.