కోదాడ, జూలై11 : కోదాడ పట్టణంలో రూ. 16.92 కోట్లతో నిర్మించనున్న అధునాతన బస్టాండ్, డిపో నిర్మాణ పనులకు శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఐదున్నర ఎకరాల్లో వాణిజ్య సముదాయం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కోదాడ బస్టాండ్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ బస్టాండ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.
మహాలక్ష్మి పథకం కింద రోజుకు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ఇప్పటి వరకు 326 కోట్లకు పైగా మహిళలు ప్రయాణించడంతో రూ. 11,406 కోట్ల మేర ఖర్చు వచ్చిందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో రవాణా, విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలతో బస్టాండ్ నిర్మాణం పూర్తయితే కోదాడకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అన్నారు. అనంతరం కోదాడ నరసింహులగూడెం, మోతె మార్గంలో కొత్త బస్సు సర్వీసును మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌లో నూతన బస్టాండ్
హుజూర్నగర్, జూలై 11 : హుజూర్నగర్ పట్టణంలో రూ. 3.52 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు శనివారం మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్రయాణికులకు అసరమైన అన్ని వసతులు కల్పిస్తామని మంత్రులు తెలిపారు. బస్‌స్టాండ్ నిర్మాణంతో హుజూర్‌నగర్‌తో పాటు పరిసర మండలాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, 3వ వార్డు కౌన్సిలర్ నాగలక్ష్మి చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.