బడిలో చేరలేదు. తరగతి గదిలో ఆధునిక పాఠాలు విన్నదీ లేదు. కానీ ఆయన రూపొందించిన పాఠ్యాంశాలే బడి పిల్లలకు పాఠాలు! అంతరించే ప్రమాదంలో ఉన్న బాల్టీ భాషను కాపాడేందుకు అతని కృషి భాషాభిమానులకూ పాఠాలే! ఒక సామాన్యుడు చేసిన కృషి బాల్టీ భాషనే కాదు, స్థానిక సంస్కృతి, చరిత్రను కాపాడింది. అఖోనే అస్గర్ అలీ బషరత్ ప్రయత్నం అంతరించే ప్రమాదంలో ఉన్న భాషా సంస్కృతుల మనుగడకు తొవ్వ చూపింది.
భారత దేశం వేల భాషలకు పుట్టినిల్లు. ఆ భాషల్లో ఎన్నో అంతరించాయి. మరెన్నో కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి. ఆ భాషలకు వచ్చిన ప్రమాదమల్లా అది మాట్లాడే సమూహం అంతరించిపోవడమే. బాల్టీ భాషకు వచ్చిన ప్రమాదం మాత్రం వేరు. ఆ భాష మాట్లాడే ప్రజలున్నారు. కానీ, ఆ సమూహాన్ని రెండు భాగాలు చేస్తూ ఓ సరిహద్దు ఒక భాషా సంస్కృతి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. టిబెటన్ భాషా కుటుంబానికి చెందిన బాల్టీ మాట్లాడే సమూహం లడఖ్, ఉత్తర కశ్మీర్లో నివసిస్తున్నది. వీరిలో కొంతమంది భారత్ భూభాగంలో ఉన్నారు. మరికొంతమంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నారు. ఈ భాష మాట్లాడే ప్రజలు అల్ప సంఖ్యాకులు. అందువల్ల విద్య, పత్రికలు, సాహిత్యంలో ఆ భాషకు ప్రాధాన్యం కొరవడింది. దీంతో వాళ్లు ఇతర భాషల వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. 2001 నాటి జనాభా లెక్కలను 2011 నాటి జనాభా లెక్కలను పోల్చితే బాల్టీ మాట్లాడే ప్రజలు 31 శాతం తగ్గిపోయారు. ఆ భాష మనుగడకు ముప్పు ముంచుకొచ్చింది. యునెస్కో విడుదల చేసిన అంతరించే ప్రమాదంలో ఉన్న భాషల జాబితాలో బాల్టీ కూడా చేరింది.
అక్షరం దిద్దిన కవి
కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లోని కార్గిల్ పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో కర్కిచ్చూ గ్రామం ఉంది. అఖోనే అస్గర్ అలీ బషారత్ది అదే ఊరు. ఆయన పెద్దగా చదువుకోలేదు. కనీసం బడికి కూడా పోలేదు. వాళ్ల నాన్న ఇంట్లోనే మదర్సా నిర్వహించేవాడు. అందులో బాల్టీ భాషతోపాటు పారశీ, అరబిక్ నేర్పించేవాడు. తన ఇరవయ్యో ఏట రాయడం, చదవడం నేర్చుకున్నాడు అస్గర్ అలీ. కొన్నాళ్లకు కవితలు రాయడం మొదలుపెట్టాడు. తొలినాళ్లలో మత పరమైన శ్లోకాలు రాసేవాడు. కొంతకాలం తర్వాత సామాజికాంశాలను సృజించాడు. గుల్దస్తే బషారత్, బాజ్మే బషారత్ సంకలనాలు ఆయన రచనల్లో చాలా ప్రసిద్ధమైనవి. మౌకికంగా ఉన్న స్థానిక ప్రజల చరిత్ర, సంస్కృతికి సంబంధించిన విశేషాలెన్నిటినో సేకరించాడు. బాల్టీ మాట్లాడే ప్రజల చరిత్ర, సామాజిక జీవితాన్ని ప్రచురించాడు. యాభై ఏళ్లపాటు కృషి చేసి బాల్టీ భాషను ప్రామాణీకరించాడు.
ముషాయిరా
రెండు దశాబ్దాల క్రితం.. ఆల్ ఇండియా రేడియో, కార్గిల్‌లో ఆకాశవాణి కేంద్రాన్ని స్థాపించింది. కార్గిల్ రేడియో కేంద్రం నుంచి మొదటి రోజే స్థానికుల కోసం బషారత్ కవితలు వినిపించారు. అప్పటి నుంచి బాల్టీ మాట్లాడే ప్రజల కోసం ఆయన ముషాయిరాలు వినిపిస్తూనే ఉన్నారు. ‘మెహిఫిల్ ఏ ముషాయిరా’ పేరుతో రేడియో ప్రసంగాల రచయితగా, వ్యాఖ్యాతగా పనిచేస్తూ బాల్టీ భాషా పరిమళాలను ఇంటింటికీ చేరవేశాడు. రెండు దశాబ్దాలుగా రేడియో ద్వారా బాల్టీ భాషాభివృద్ధికి తోడ్పడుతూ, ఆ భాషా సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేశాడు.
బడిలో కొత్త పాఠాలు
జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషను బోధించేందుకు బాల్టీని ప్రవేశపెట్టింది. అప్పుడు పాఠ్యపుస్తకాల రూపకల్పన కోసం ఆ రాష్ట్ర పాఠశాల విద్యా మండలి అస్గర్ అలీని ఎంచుకుంది. తర్వాత కాలంలో ఆయన సూచనల ఆధారంగా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి బాల్టీ భాష నేర్చుకునే పుస్తకాలు రూపొదించింది. అస్గర్ అలీ కృషి, పాఠశాలల్లో బోధన వల్ల కొత్త తరం బాల్టీ భాషను నేర్చుకుంటున్నది. అలా బాల్టీ అంతరించిపోయే ప్రమాదాన్ని తప్పించుకుంది. బాల్టీ ప్రజల సంస్కృతి వికసించేందుకు దోహదపడింది. స్థానిక భాష, సంస్కృతి, చరిత్ర పరిరక్షణ కోసం యాభై ఏళ్ల నిర్విరామ కృషిని ప్రశంసిస్తూ లడఖ్ విశ్వవిద్యాలయం అస్గర్ అలీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం ప్రదానం చేసే అవార్డుల్లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ ఆయనను వరించింది. పద్మశ్రీ అందుకున్న ఒకే ఒక్క బాల్టీ రచయితగా ఆయనకు గుర్తింపు దక్కింది.