హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నాగార్జునసాగర్‌లో ప్రభుత్వం రూపొందించిన బుద్ధవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. బుద్ధవనం సమీపంలోని చాకలిగట్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు ఆల్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నోముల భగత్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. స్వదేశీ దర్శన్ కింద రూ.830 కోట్లతో కోయిల్‌సాగర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించిదని, ఇంకా అనుమతి రాలేదని చెప్పారు.