నార్నూర్ : వర్షాకాలం వస్తే చాలు వంతెనలేని ఆదివాసుల గ్రామాలు (Tribal Villages ) బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి నెలకొంటుంది. స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్న గిరిజన గ్రామాలకు కనీస రోడ్లు ( Road) , వంతెనను ( Bridges ) లేక అవస్థలు పడుతున్న పట్టించుకునే నాథులే కరువయ్యారు. గ్రామాలకు రోడ్లు వంతెనలు నిర్మించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న తమ గ్రామాల సమస్యలు తీర్చడం లేదంటూ మొరపెట్టుకుంటున్నారు, వర్షాలు కురిసేటప్పుడు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండవలసి వస్తుందన్నారు. ఓట్ల కోసం అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పేవాళ్లు గెలిచాక తమ గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు. గతంలో కూడా వంతెనలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు పంపించిన కాగితాలకి పరిమితమవుతున్నాయి.
అత్యవసర పరిస్థితులలో తమ గ్రామాలకు కనీసం ఆంబులెన్స్ రాని పరిస్థితి ఏర్పడింది. గ్రామాలకు వైద్య సేవలు అందించాలన్న వైద్యాధికారులు వాగులు దాటవలసి వస్తుందని, తాము ఇతర గ్రామాలకు వెళ్లాలన్న వరద నీరు తగ్గేవరకు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నానూరు మండలంలోని బారిక్ రావు గూడ,చిత్తగూడ,దనుగూడ, గాదిగూడ మండలంలోని మారుగూడ, కునికసా, పూనా గూడ,కుండి తో పాటు పలు గ్రామాలకు వంతెన, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలకు రోడ్లు, వంతెనలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.