దామెర, ఏప్రిల్ 25 : ఇష్టం లేని పెండ్లి చేశారంటూ ఓ వివాహిత సరిగ్గా నెల రోజులకే బ్లేడ్‌తో భర్త మెడ కోసింది. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో వెలుగుచూసింది. పరకాల ఏసీపీ శివరామయ్య, స్థానికుల కథనం ప్రకారం.. పసరగొండకు చెందిన మాడిశెట్టి స్వామి-కళ దంపతుల పెద్ద కుమారుడు మాడిశెట్టి రాజు (30)కు ఆత్మకూరు మండలం మల్కపేటకు చెందిన యువతితో గత నెల 25న వివాహం జరిగింది. కొద్దిరోజులుగా భర్త అంటే ఇష్టం లేదని తరచూ చెబుతుండేది.
ఈ క్రమంలో కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేయాలని ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 23న దరఖాస్తు చేశానని, వచ్చి తనను తీసుకెళ్లాలని భర్తకు ఫోన్ చేయడంతో అతను వచ్చి ఆమెను పసరగొండకు తీసుకొచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి రాజు నిద్రలో ఉండగా బ్లేడ్‌తో అతడి మెడను కోసింది. రక్తస్రావం కావడంతో రాజు లేచి వెళ్తుండగా మరోసారి కోసే ప్రయత్నం చేయగా అతడు బయటకు పరిగెత్తాడు. ఆరుబయట నిద్రిస్తున్న తల్లిదండ్రులకు, తమ్ముడికి చెప్పాడు. వారు స్థానికుల సహాయంతో రాజును వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.