హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టీజీ జెన్కో ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. అయితే వీటిలో ఐదువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను ప్రైవేట్ కంపెనీల చేతిలో పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. వీటిని డిజైన్ బిల్డ్ పైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్(డీబీఎఫ్‌వోటీ) పద్ధతిలో జెన్కో నిర్మించనుంది. అంటే దాదాపు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలాగే వీటిని నిర్మించనుంది. ఇదిలా ఉండగా మరో ఐదువేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను జెన్కో సొంతంగా నిర్మించాలనుకుంటున్నది. ఇందుకు సంబంధించి ఈ ప్రణాళికలు ప్రభుత్వానికి చేరవేసింది. ఈ నెలలోనే నిర్వహించనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదనలను రానున్నాయి. అయితే ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్న వాటికే సర్కారు పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పంప్డ్‌స్టోరేజీ పవర్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణపై ఇప్పటికే టీజీ జెన్కో ఓ కన్సల్టెన్సీ చేత సర్వే కూడా నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్రంలో 25కు పైగా స్థలాల్లో పంప్డ్‌స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నట్లుగా తేల్చింది. వీటిలో అత్యధికం గోదావరి బేసిన్లోనే ఉన్నాయి. ఈ సర్వే సూచనలకు తగ్గట్టుగా 10 వేల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంచేసింది.
కొత్తగా ఏర్పాటు చేసే ఈ ఐదు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రూ.21 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. వీటిలో కల్లూరు ప్లాంట్‌కు రూ. 7 వేల కోట్లు, దురదపాడు ప్లాంట్‌కు రూ.5,500 కోట్లు, లోయపల్లి ప్లాంట్, సింగభూపాలం ప్లాంట్లకు ఒక్కోదానికి రూ. 4 వేల కోట్లు, అంజనగిరి ప్లాంట్‌కు రూ. 600 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనావేశాయి. అయితే ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం, జెన్కోలు సంయుక్తంగా భరించడం కష్టంగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ రంగంలో ఈ ప్లాంట్లను నిర్మించాలని జెన్కో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. స్థలం, నీటి వసతిని ప్రభుత్వం కల్పించనుండగా..ప్రైవేట్ సంస్థలు ప్లాంట్లను నెలకొల్పి నిర్వహించనున్నారు. అయితే వీటిని ప్రైవేట్ రంగంలోనే నిర్మించినా 15 ఏండ్ల తర్వాత ఈ ప్లాంట్లను తిరిగి జెన్‌కోకే అప్పగించాల్సి ఉంటుందని, అలా మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది జల విద్యుత్తు ఉత్పిత్తిచేసే ప్లాంట్‌గానే చెప్పుకోవచ్చు. ఇవి ఎగువన, దిగువన రెండు రిజర్వాయర్లు కలిగి ఉంటుంది. మొదట దిగువన గల రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేస్తారు. విద్యుత్తు ఎక్సేంజీలో యూనిట్ విద్యుత్తు చౌకగా (రూపాయికి) దొరికినప్పుడు ఆయా విద్యుత్తును కొనుగోలు చేసి, వినియోగించి పంపుల ద్వారా దిగువ రిజర్వాయర్‌లోని నీటిని ఎగువకు పంప్‌చేస్తారు. పైభాగంలోని రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేస్తారు. విద్యుత్తుకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు (యూనిట్‌కు రూ. 8 -9) పలికినప్పుడు ఎగువ నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఈ నీరు టర్బైన్ల గుండా ప్రవహించి సాధారణ జల విద్యుత్తు కేంద్రం వలే విద్యుత్తును ఉత్పత్తిచేస్తుంది. ఇలా విద్యుత్తును ఉత్పత్తిచేయడమే పంప్డ్ స్టోరేజీ. మార్కెట్లో సోలార్ విద్యుత్తు రూపాయి లోపే దొరుకుతున్నదని, ఈ విద్యుత్తును ఉపయోగించి అత్యంత చౌకగా విద్యుత్తును ఉత్పత్తిచేయవచ్చని టీజీ జెన్కో సీఎండీ హరీష్ అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంట్ల ఏర్పాటులో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలు ముందంజలో ఉన్నాయన్నారు. తెలంగాణలో 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్తుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.