Road Accident | ఏపీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయపల్లెమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది గాయాలకు గురయ్యారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మొదట ముందు వెళ్తున్న లారీని బస్ డ్రైవర్ ఢీకొట్టాడు. ఆ తర్వాత ఆగిన బస్సును వెంటనే వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దాంతో బస్లో వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఇరుక్కున్న లారీ డ్రైవర్ను అతికష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.