హనుమకొండ చౌరస్తా, జూన్ 1 : 2025-26 విద్యాసంవత్సరానికి బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్-2025 ఆన్లైన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి సెషన్-1 కోసం సెట్ ‘ఏ’, టీజీ ఎడ్‌సెట్-2025 చైర్మన్ విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ ప్రతాప్‌రెడ్డి సెషన్-2 కోసం సెట్ ‘బీ’ పరీక్ష పత్రాల ‘పాస్వర్డ్’ను రిజిస్ట్రార్ రామచంద్రం, కన్వీనర్ వెంకట్రామరెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, మొహమ్మద్, సెక్రటరీ శ్రీరామ్వెంకటేశ్, విద్యావిభాగ డీన్ రామనాథకిషన్, ప్రిన్సిపాల్ మనోహర్, దూరవిద్య కేంద్ర సంచాలకులు సురేశ్‌లాల్, నరేందర్ సమక్షంలో విశ్వవిద్యాలయంలోని టీజీ ఎడ్‌సెట్-2025 కార్యాలయంలో ఉదయం 8 గంటలకు విడుదల చేశారు.
రెండు సెషన్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 74, మధ్యాహ్నం 73 ప్రాంతీయ కేంద్రాల్లో 38,758 అభ్యర్థులు నమోదు చేసుకోగా, 32,106 మంది పరీక్ష రాశారు. 83 శాతం హాజరు నమోదైంది. వరంగల్ మొక్షితా ఇనిస్టిట్యూట్, బొల్లికుంట వాగ్దేవి కాలేజీ, హనుమకొండలోని అయాన్ ఇనిస్టిట్యూట్, జయ కాలేజీ, సుమతిరెడ్డి కాలేజీ, వాగ్దేవి హనుమకొండ, నోబెల్ ఇనిస్టిట్యూట్‌తో పాటు పలు పరీక్షా కేంద్రాలను స్టేట్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చాన్సలర్ ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, వైస్ చైర్మన్లు పురుషోత్తం, మొహమ్మద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్‌తో కలిసి సందర్శించినట్టు కన్వీనర్ వెంకట్రామరెడ్డి వెల్లడించారు.
13 లేదా 14న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 13 లేదా 14న విడుదలకానున్నాయి. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నది. పరీక్షల మూల్యాంకనం ఈ నెల 6తో పూర్తికానున్నది. తర్వాత ప్రాక్టికల్స్, సహా ఇంటర్నల్స్ పరీక్షలను పూర్తిచేసి 13, 14 తేదీల్లో ఫలితాలు విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు.
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఐఐటీ కాన్పూర్ ఉదయం 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను విడుదల చేయనున్నది. విద్యార్థులు ఫలితాల కోసం jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. తర్వాత ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ఈనెల 3 నుంచి ప్రారంభంకానున్నది. అదే రోజు నుంచి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 14న మొదటి రౌండ్, 21న రెండు, 28న మూడు, జూలై 4న నాలుగు, జూలై 10న ఐదోరౌండ్ సీట్లు కేటాయిస్తారు. జూలై 16న ఫైనల్ రౌండ్ సీట్లు కేటాయిస్తారు.