ఇంఫాల్, నవంబర్ 13: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఖుగా బెటాలియన్ కమాండింగ్ అధికారి కర్నల్ విప్లవ్ త్రిపాఠి కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని మందుపాతరలు పేల్చారు. బాంబులు విసిరారు. అనంతరం జవాన్లపైకి కాల్పులు జరిపారు. ఈ దాడిలో కర్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, ఆరేండ్ల కుమారుడితో పాటు మరో నలుగురు జవాన్లు .. మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చూరాచాంద్‌పూర్ జిల్లాలో భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలో ఈ తీవ్రవాద దాడి జరిగింది. మణిపూర్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎంఎన్‌పీఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తీవ్రవాద దాడిని ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఖండించారు. బాధితులకు తప్పక న్యాయం చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తీవ్రవాదుల కోసం పోలీసులు, పారామిలిటరీ బలగాలు గాలిస్తున్నాయి.