హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్షలు మే 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలల సిలబస్‌ను కుదించడంతోపాటు గతేడాది పదో తరగతి పరీక్షల పేపర్లను 11 నుంచి 6కు కుదించినా వైరస్ వ్యాప్తి వల్ల పరీక్షలను నిర్వహించలేదు. తాజాగా ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్థులకు 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అన్ని పేపర్లకు ఒకే బుక్‌లెట్‌ను ఇవ్వనుండగా, జనరల్ సైన్స్ పరీక్షకు రెండు వేర్వేరు బుక్లెట్లను ఇవ్వనున్నారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పేపర్లను వేర్వేరుగా మూల్యాంకనం చేయాల్సి ఉండగా, అందుకు అనుగుణంగా ఆ పరీక్షకు సంబంధించి వేర్వేరుగా జవాబు బుక్లెట్లను అందించనున్నారు. పరీక్ష సమయం 2.30 గంటలు. ఆయా పరీక్ష పేపర్ల ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రాలను చివరి 30 నిమిషాలు ఉన్నదనగా విద్యార్థులకు అందించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
టెన్త్ పరీక్షల షెడ్యూల్..
తేదీ :సబ్జెక్ట్
11 మే :ఫస్ట్ లాంగ్వేజీ, కాంపోజిట్ కోర్స్ పేపర్ 1, 2
12 మే :సెకండ్ లాంగ్వేజీ
13 మే :థర్డ్ లాంగ్వేజీ (ఇంగ్లిష్)
14 మే :మ్యాథమెటిక్స్
16 మే :జనరల్ సైన్స్ (ఫిజికల్, బయోలాజికల్)
17 మే :సోషల్ స్టడీస్
18 మే :ఒకేషనల్ మెయిన్ లాంగ్వేజీ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్)
19 మే : ఒకేషనల్ మెయిన్ లాంగ్వేజీ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్)
20 మే : ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ)