మాస్కో: రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా చమురు ట్యాంకర్ను అమెరికా సీజ్ చేయడంతో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో రష్యన్ నేత అలెక్సీ ఝురవ్లెవ్ గురువారం అమెరికాను గట్టిగా హెచ్చరించారు. సముద్రాలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అమెరికా కొనసాగిస్తే, ఆ దేశాన్ని సైనికపరంగా ఎదుర్కొనవలసి ఉంటుందని చెప్పారు. తనను దండించేవారు లేరనే భావనతో అమెరికా వ్యవహరిస్తున్నదన్నారు.
దానిని దీటైన ప్రతీకార చర్యల ద్వారా నిలువరించాలని తెలిపారు. ‘టార్పెడోలతో దాడి చేయాలి, అమెరికన్ తీర గస్తీ పడవలను ముంచేయాలి. సాధారణంగా అమెరికా తనకు వేలాది కిలోమీటర్ల దూరంలో గస్తీ కాస్తుంది’ అని చెప్పారు. వెనెజువెలాలో స్పెషల్ ఆపరేషన్ తర్వాత అమెరికా తనకు ఎదురులేదనే యూఫోరియాలో ఉందని, దానిని ముక్కు మీద కొడితేనే ఆపగలమని అన్నారు. స్కాట్లాండ్ ఉత్తర దిశలోని అంతర్జాతీయ జలాల్లో రష్యా జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ మరినెరా, (బెల్లా 1)ను అమెరికన్ మిలిటరీ దళాలు జప్తు చేసిన కొద్ది గంటల్లో అలెక్సీ ఈ విధంగా స్పందించారు.
అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా చమురు ట్యాంకర్లో ఉన్న మొత్తం 28 మంది సిబ్బందిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని రష్యా గురువారం వెల్లడించింది. సిబ్బంది పట్ల మర్యాదపూర్వకంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అమెరికాకు రష్యా విజ్ఞప్తి చేసింది. సాధ్యమైనంత త్వరగా విదేశీయులందరినీ విడుదల చేయాలని కోరింది. నౌకలో 17 మంది ఉక్రెయిన్ జాతీయులు, ఆరుగురు జార్జియా దేశస్థులు, ముగ్గురు భారతీయులు ఉన్నారు. నౌక కెప్టెన్తోసహా ఇద్దరు రష్యన్ పౌరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా అమెరికా అధికారులకు బందీలుగా ఉన్నారు.